Categories: TOP STORIES

ఇలాంటి మోసగాళ్లూ ఉంటారు.. జాగ్రత్త

మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. పైగా రియల్ రంగంలో మోసాలు ఎక్కువనే అపప్రధ ఎలానూ ఉంది. తాజాగా రియల్ ఎస్టేట్ లో కొత్త తరహా మోసం బయట పడింది. ఓ వ్యక్తి బిల్డర్ లా నటిస్తూ.. పలువురు కొనుగోలుదారులను మోసం చేశాడు. ఇతరుల ఫ్లాట్లను తనవిగా నమ్మించి వారి దగ్గర డబ్బులు తీసుకుని అదృశ్యం కావడం అతడి దినచర్య. తాజాగా ఇద్దరు బాధితులు అతడి చేతిలో మోసపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

మహారాష్ట్రలోని వసాయికి చెందిన 30 ఏళ్ల సుమిత్ దూబే తనను తాను బిల్డర్ గా పరిచయం చేసుకుంటాడు. వసాయ్ ప్రాంతంలోని కొత్త, పాత భవనాల్లోని ఫ్లాట్ల విక్రయాలను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ప్రచారం చేస్తాడు. టూ స్టార్ రియల్టీ కంపెనీ, మహాలక్ష్మి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పేర్లతో ఈ ప్రచారం చేస్తాడు. అంతేకాకుండా వసాయ్, నలసోపరాలో అనేక ఫ్లాట్లు విక్రయానికి ఉన్నాయంటూ ఆన్ లైన్ వెబ్ సైట్లలో కూడా ప్రకటనలు ఇస్తాడు. కొత్త ప్లాట్లపై ఆసక్తి ఉన్నవారికి ఇతర బిల్డర్లు నిర్మిస్తున్న ప్లాట్లను చూపిస్తాడు. అనంతరం అడ్వాన్స్ పేరుతో కొంత మొత్తం తీసుకుని తర్వాత ఉడాయిస్తాడు. ఇలా ఇటీవల ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేసి కనపడకుండా పోయాడు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి సహచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

This website uses cookies.