Categories: TOP STORIES

మోడీ రియాల్టీకి ఎంత మేలు చేశారు?

  • 2014- 2024 రియాల్టీలో మోడీ ఎఫెక్ట్ పేరిట‌..
    సంయుక్త నివేదిక విడుద‌ల చేసిన న‌రెడ్కో, అన‌రాక్
  • రియాల్టీ జీఎస్టీ వ‌సూళ్ల‌లో తెలంగాణ ఎక్క‌డ‌?
  • మోడీ నిజంగానే రియాల్టీలో అద్భుతం చేసి ఉంటే..
    2020 త‌ర్వాత రియాల్టీ ఎఫ్‌డీఐలు ఎందుకు త‌గ్గాయ్‌?

2014 నుంచి 2014 దాకా భార‌త నిర్మాణ రంగానికి మోడీ చేసిన మేలేంటి? ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు రియ‌ల్ రంగాన్ని ఎలా ప్ర‌భావితం చేసింది? ఏయే విభాగంలో నిర్మాణ రంగం అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది? దేశంలో ఎంత‌మంది సామాన్యుల సొంతింటి క‌ల తీరింది? జీఎస్టీ వసూళ్ల శాతం ఎంత పెరిగింది? త‌దిత‌ర అంశాల్ని స్పృశిస్తూ.. ప్ర‌ధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణ‌యాల్ని కీర్తిస్తూ.. న‌రెడ్కో నేష‌న‌ల్ అన‌రాక్‌తో క‌లిసి తాజాగా ఒక నివేదిక‌ను విడుద‌ల చేశాయి. రాత్రికి రాత్రే ఐదు వంద‌ల నోట్ల ర‌ద్దు, డీమానిటైజేష‌న్‌, జీఎస్టీల‌ను ప‌ద్ధ‌తీప్ర‌కారం లేకుండా దేశంలో ప్ర‌వేశ‌పెట్టి.. రియ‌ల్ రంగాన్ని న‌డ్డి విరిచిన న‌రేంద్ర‌మోడీ.. ఆత‌ర్వాత నిర్మాణ రంగానికి గొప్ప మేలు చేశాడంటూ తాజా నివేదిక ఉండ‌టం విశేషం.

మొన్న తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ కార‌ణంగా తెలంగాణ రియ‌ల్ రంగం ఎలా వృద్ధి చెందింద‌నే అంశంతో కొన్ని సంస్థ‌లు నివేదిక‌ను వండివార్చిన‌ట్టే.. ఈ రిపోర్టు ఉండ‌టం గ‌మ‌నార్హం. భార‌త ప్ర‌ధానిమంత్రిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికో లేదా ఆయ‌న మెప్పును పొంద‌డం కోస‌మో ఈ నివేదిక‌ను విడుద‌ల చేసిన‌ట్లుగా స్ప‌ష్టంగా కనిపిస్తుంది. గ‌త ప‌దేళ్ల‌లో నిర్మాణ రంగానికి ప్ర‌ధాని మోడీ నిజంగానే స‌రికొత్త దిశానిర్దేశం చేసి ఉన్న‌ట్ల‌యితే.. 2020 త‌ర్వాత నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబ‌డులు ఎందుకు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌నే విష‌యాన్ని నివేదిక‌లో పెద్ద‌గా విశ‌దీక‌రించ‌లేదు.

తెలంగాణ రియ‌ల్ రంగం గ‌త ఐదేళ్ల‌లో గ‌ణ‌నీయ‌మైన రీతిలో పురోగ‌తి చెందింది. ముఖ్యంగా హైద‌రాబాద్‌లోని ప‌లు కీల‌క ప్రాంతాలైన కోకాపేట్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్, రాయ‌దుర్గం, నాన‌క్‌రాంగూడ‌, నార్సింగి, శేరిలింగంప‌ల్లి, న‌ల‌గండ్ల‌, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఆకాశ‌హ‌ర్మ్యాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. అపార్టుమెంట్ల ధ‌ర‌లూ భారీగానే పెరిగాయి. ఆకాశ‌హ‌ర్మ్యాల్లో కొనేవారి సంఖ్య రెట్టింపైంది. అస‌లు ఆకాశ‌హ‌ర్మ్యంలో కొనక‌పోతే.. అదేదో గొప్ప త‌ప్పు చేసిన‌ట్లుగా కొంద‌రు పెట్టుబ‌డిదారులు, ప్ర‌వాసులు భావించే ప‌రిస్థితులుండేవి. ఇదంతా బాగానే ఉంది. కాక‌పోతే, నిర్మాణ రంగానికి సంబంధించిన జీఎస్టీ వ‌సూళ్ల‌లోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొమ్మిది స్థానంలో నిల‌వ‌గా.. మ‌న‌త‌ర్వాతి స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిలిచింది. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌లో మొద‌టి మూడు స్థానాల్లో నిల‌వ‌డం విశేషం. 2018-19వ ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌హారాష్ట్ర‌లో జీఎస్టీ వ‌సూలు ల‌క్షా డెబ్బ‌య్ వేల కోట్లు ఉండ‌గా.. 2022-23 నాటికి ల‌క్ష కోట్లు పెరిగి 2.70 కోట్ల‌కు చేరింది. క‌ర్ణాట‌క‌లో కూడా జీఎస్టీ వ‌సూళ్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం విష‌యానికి వ‌చ్చేస‌రికి, 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో జీఎస్టీ 36 వేల కోట్లు ఉండ‌గా.. క్రితం ఆర్థిక సంవ‌త్స‌రం నాటికి 51 వేల కోట్ల‌కు చేరింది.

 

దేశ‌వ్యాప్తంగా జీఎస్టీ వ‌సూళ్లు (కోట్ల‌లో)

2018-19 2019-20 2020-21 2021-22 2022-23
మ‌హారాష్ట్ర 1,70,289 1,85,917 1,65,308 2,17,993 2,70,346
క‌ర్ణాట‌క‌ 78,762 83,408 75,660 95,926 122821
గుజ‌రాత్‌ 73,440 78,923 74,346 97,155 1,14,222
త‌మిళ‌నాడు 70,562 74,430 69,121 85,492 1,04,377
ఉత్త‌ర్ ప్ర‌దేశ్ 61,323 65,281 59,721 73,865 87,969
హ‌ర్యానా 55,233 59,560 54,890 68,142 86,669
ప‌శ్చిమ బెంగాల్ 39,780 43,386 39,694 47,898 58,059
ఢిల్లీ 39,845 44,161 36,568 46,253 55,843
తెలంగాణ‌ 36,408 39,820 36,346 45,081 51,831
ఆంధ్ర‌ప్ర‌దేశ్ 25,331 27,108 26,163 32,710 40,233

 

2014లో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేస్తే జీఎస్టీ ప‌న్నెండు శాతం చెల్లించాల్సి వ‌చ్చేది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకంటే ఇంత మొత్తం తీసుకునేవారు. అదే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేక‌పోతే గ‌న‌క ఐదు శాతం వ‌సూలు చేసేవారు. దానికి అనుగుణంగానే కొనుగోలుదారులు జీఎస్టీ చెల్లించేవారు. అయితే, అందుబాటు గృహాల‌పై 2019లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్న‌ట్ల‌యితే 8 శాతం వ‌సూలు చేసేవారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేక‌పోతే గ‌న‌క 1 శాతం జీఎస్టీని కొనుగోలుదారులు చెల్లించేవారు. అయితే, 2019 నుంచి నేటివ‌ర‌కూ.. ఎన్‌వోసీ వ‌చ్చిన త‌ర్వాత‌.. గృహ‌ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల‌ను బ‌య్య‌ర్లు కొంటే.. జీఎస్టీ చెల్లించ‌కర్లేదు. కాక‌పోతే, ప్రాజెక్టులు గృహ‌ప్ర‌వేశానికి వ‌చ్చేస‌రికి బిల్డ‌ర్లు ధ‌ర‌ల్ని పెంచేస్తార‌నే విష‌యం తెలిసిందే.

This website uses cookies.