Categories: LEGAL

రెరా చరిత్రాత్మక నిర్ణయం

కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం రాజస్థాన్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (రాజస్థాన్ రెరా) చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఓ ప్రాజెక్టులోని కొన్ని ఫ్లాట్లను వేలం వేయాలన్న యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని అడ్డుకుంది. ఆ వేలాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ఆ ప్రాజెక్టును పూర్తిచేసి కొనుగోలుదారులకు అప్పగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్ రెరా చైర్మన్ నిహల్ చంద్ గోయ 100 పేజీల ఆదేశాలు జారీచేశారు. అశోక్ మార్గ్ సి-స్కీమ్ లో ఎస్ ఎన్ జీ రియల్ ఎస్టేట్ సంస్థ 2014లో సన్ రైజర్స్ పేరుతో ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. అనంతరం పలువురు కొనుగోలుదారులు సంస్థతో ఒప్పందం చేసుకుని ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు.

ఈ మేరకు అవసరమైన డబ్బులు కూడా చెల్లించారు. ఇందుకోసం పలువురు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని నెలవారీ వాయిదాలు కూడా చెల్లిస్తూ వచ్చారు. చాలామంది కొనుగోలుదారుల ఒప్పందాలు సబ్ రిజిస్ట్రార్ వద్ద కూడా రిజిస్టర్ అయ్యాయి. అయితే, 2016లో ఎస్ఎన్ జీ రియల్ ఎస్టేట్ సంస్థ నిబంధనలను తుంగలో తొక్కింది. మొత్తం ప్రాజెక్టునే యూనియన్ బ్యాంకుకు తనఖా పెట్టి రూ.15 కోట్ల రుణం తీసుకుంది. అనంతరం సంస్థ ప్రమోటర్లు రుణం చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంకు ఆ ప్రాజెక్టును జప్తు చేసింది. తర్వాత 2020లో ఈ ప్రాజెక్టులోని 19 ఫ్లాట్లను వేలం వేయడానికి ప్రక్రియ ప్రారంభించింది. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో రెరా రంగంలోకి దిగి, ఆ వేలాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న ఆ ప్రాజెక్టును తమకు అప్పగించాలని, తామే ఆ ప్రాజెక్టును పూర్తిచేసి కొనుగోలుదారులకు అప్పగిస్తామని పేర్కొంది.

This website uses cookies.