ప్రముఖ టాలీవుడ్ నటి అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మది దోచుకున్న ఈ కేరళ కుట్టి.. తర్వాత చాలా సినిమాల్లో తెలుగువారిని అలరించింది. ప్రస్తుతం రౌడీ బాయ్స్ సినిమా ద్వారా ప్రేక్షకలోకాన్ని అలరించబోతోంది. ఈ నేపథ్యంలో తన కలల ఇల్లు ఎలా ఉండాలనే అంశంపై రియల్ ఎస్టేట్ గురుతో తన మదిలోని భావాలను ఆవిష్కరించింది.
తన ఇల్లు సంప్రదాయలకు అనుగుణంగా ఉండటంతోపాటు హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని అనుపమ పరమేశ్వరన్ స్పష్టం చేసింది. ‘ఇంట్లో కనీస ఫర్నిచర్ ఉంటే సరిపోతుందనేది నా భావన. కేరళలో మా ఇల్లు చాలా అందమైన ప్రదేశంలో ఉంటుంది. ఇంటి చుట్టూ తాటిచెట్లు ఉంటాయి. మా ఇంటిని పాత, సంప్రదాయ కేరళ డిజైన్లకు అనుగుణంగానే కట్టారు. మన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలనే నేను కూడా భావిస్తాను. నా కలల సౌథాన్ని కూడా అలాగే నిర్మించుకుంటాను. మనం రోమ్ లో ఉంటే రోమన్ లాగే ఉండాలి. మీరు ఎక్కడ నివసించాలని అనుకుంటారో అక్కడి సంప్రదాయాలతో మిళితం కావాలి’ అని ఈ ముద్దుగుమ్మ అభిప్రాయపడింది. ఇక ఇంటీరియర్ కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేయడానికి తాను వ్యతిరేకం అని పేర్కొంది. దానికి బదులు తన మనసుకు ఆహ్లాదం కలిగించే ఇంటీరియర్ పైనే దృష్టి పెడతానని చెప్పింది. అలాగే బ్రాండెడ్ వస్తువులు చాలా తక్కువగా కొంటానని వెల్లడించింది. ‘బ్రాండెడ్ వస్తువులు కొనడం అనేది నా చివరి ప్రాధాన్యత. డిజైన్, కలర్స్ ఇంకా సరసరమైన ధరనే తాను తొలుత చూస్తానని పేర్కొంది.
నటీనటులు అనగానే విలాసాలకు అలవాటుపడతారని చాలామంది అనుకుంటారు. కానీ అనుపమ మాత్రం ఇలాంటివాటికి భిన్నం. తాను విలాసాల కంటే సౌకర్యానికే ఓటు వేస్తానని స్పష్టంచేసింది. తన ఇల్లు కూడా ఇలాగే ఉంటుందని పేర్కొంది. విల్లా అంటే ఇష్టమా లేక ఫ్లాట్ లో ఉండాలన్నది అభిమతమా అని అడిగినప్పుడు.. అనుపమ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. తొలుత తనకు ఇండిపెండెంట్ ఇల్లంటేనే ఇష్టం ఉండేదని.. బహుశా బాల్యం నుంచి అలాంటి ఇంట్లో ఉండటమే ఇందుకు కారణమై ఉండొచ్చని తెలిపింది. అయితే, కాలానుగుణంగా తనకు అపార్ట్ మెంట్ పై ఆసక్తి పెరిగిందని వెల్లడించింది. ‘ఈరోజుల్లో అపార్ట్ మెంట్లు అభివృద్ధి చెందుతున్న విధానం బావుంది. అక్కడ ఉండటం భద్రంగా అనిపిస్తుంది. షూటింగుల కోసం వివిధ ప్రదేశాలకు వెళ్లినప్పుడు హోటల్ లో ఉండటం బాగా అలవాటైంది.
అందువల్లే అపార్ట్ మెంట్ పై ఆసక్తి పెరిగి ఉండొచ్చు. ఇది ఎలా ఉన్నప్పటికీ నేను పక్షుల కిలకిలారావాలు వినగలిగే ప్రశాంతమైన వాతావరణంలో ఓ ఇండిపెండెంట్ ఇల్లు కచ్చితంగా ఉండాల్సిందే’ అని వివరించింది. ఇల్లంటే మనకు భరోసా లభించే ఏకైక ప్రదేశమని అభివర్ణించింది. హోమ్, హౌస్ మధ్య తేడా ఉందని పేర్కొంది. హైదరాబాద్ అనేది తన హోమ్ అని వెల్లడించింది. ‘తెలుగు సినీ పరిశ్రమలో నేను చురుగ్గా ఉంటున్నాను. ఇక్కడి ప్రజలకు నేను తెలుసు.. నాకు వారు తెలుసు. హైదరాబాద్ నాకు అవసరమైన ప్రశాంతతను ఇస్తుంది. అలాగే ఏది కావాలన్నా ఇక్కడ సులభంగా దొరుకుతుంది. కొన్నిసార్లు ఈ నగరం మా ఇంటికి కూడా తిరిగి వెళ్లనివ్వదు’ అని అనుపమ తెలిపింది.
దాదాపు అందరు నటీనటుల్లాగే అనపమకూ ఓ కోరిక ఉంది. అదే వ్యక్తిగత గోప్యత. తనను ఎవరూ గుర్తుపట్టని చోట స్వేచ్ఛగా జీవించాలన్నది ఆమె అభిలాష. సాధారణ జనంలాగే రోడ్లపై నడుచుకుంటూ వెళ్లాలని.. అందరిలాగే తిరగాలని ఉంటుందని.. ఈ నేపథ్యంలో అలాంటి చోట ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఇల్లు ఎలా ఉండాలని అడిగితే.. సౌకర్యం, అమ్మతో కలిసి మొక్కలు పెంచడానికి అవసరమైన స్థలం ఉండాలని పేర్కొంది. తన ఇంటి డిజైన్ తానే చేస్తానని.. మీకంటే ఎవరికీ ఎక్కువ ఏమీ తెలియదని చెప్పింది. తమ పాత ఇంటి ఇంటీరియర్ ను తానే డిజైన్ చేశానని, అమ్మతో కలిసి బయటకు వెళ్లి అవసరమైన ఫర్నిచర్ కొనుక్కుని తీసుకొచ్చానని చెప్పింది. అయితే, అంతమాత్రాన ఇంటీరియర్ డిజైనర్ల వల్ల ఉపయోగం లేదనడం కూడా కరెక్ట్ కాదని స్పష్టంచేసింది. మొత్తానికి అనుపమ చెప్పిన విషయాలను, ఆమె ఆలోచనా ధోరణిని పరిశీలిస్తే.. ఆమె ఎప్పుడు ఇల్లు కట్టుకున్నా అది అదిరిపోవడం ఖాయమనిపిస్తోంది. సెలబ్రిటీల ఇళ్లు ఎలా ఉంటాయో అని జనం ఆసక్తిగా ఎదురుచూసే ఇళ్లలో అనుపమ ఇల్లు కచ్చితంగా ఉంటుంది.
This website uses cookies.