Categories: LEGAL

రాంకీ అంశంలో తప్పంతా హెచ్ఎండీఏదే!

  • హెచ్ఎండీఏ తీరును తప్పుబట్టిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్ లోని సర్వే నెంబర్ 227, 230ల్లో రాంకీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు విషయంలో హెచ్ఎండీఏ సరిగా వ్యవహరించలేదని హైకోర్టు తప్పబట్టింది. ఈ విషయంలో హెచ్ఎండీఏ పూర్తిగా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిందని వ్యాఖ్యానించింది. రూ.75 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దు నోటీసు ఇచ్చి చర్యలు చేపట్టలేదని, నోటీసును సవాల్ చేస్తూ రాంకీ సంస్థ హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా హెచ్ఎండీఏ చేపట్టిన ఆర్బిట్రేషన్, చట్టపరమైన చర్యల గురించి తెలియజేయలేదని పేర్కొంది. హెచ్ఎండీఏ లేఖ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు విల్లాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం చెల్లదని స్పష్టం చేసింది.

శ్రీనగర్ లో రాంకీ, హెచ్ఎండీఏ చేపట్టిన గార్డీనియా, గ్రోవ్ విల్లా, గ్రీన్ వ్యూ, హడిల్, గోల్డెన్ సర్కిల్ విల్లాలు, ఫ్లాట్లకు సంబంధించిన భూమి నిషేధిత జాబితాలో ఉందంటూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ఱేషన్లు నిరాకరించారు. దీనిని సవాల్ చేస్తూ రాంకీ సంస్థ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒప్పందంలో భాగంగా రాంకీ సంస్థ రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.25 కోట్లు మాత్రమే చెల్లించిందని హెచ్ఎండీఏ తరపు న్యాయవాది నివేదించారు. అయితే, ఒప్పందంలోని షరతులు ఉల్లంఘిస్తే చట్టప్రకారం హెచ్ఎండీఏ చర్యలు చేపట్ట్లాల్సి ఉందని, కానీ ఈ కేసులో అలాంటిది ఏదీ చేసినట్టు రికార్డులు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడానికి చట్టప్రకారం ఎలాంటి కారణాలూ కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. కేవలం హెచ్ఎండీఏ లేఖ ఆధారంగా రిజిస్ట్రేషన్లను నిరాకరించొద్దని సబ్ రిజిస్ట్రార్ ను ఆదేశించారు.

This website uses cookies.