వృద్ధాప్యంలో తమ బాగోగులు చూస్తారనే ఉద్దేశంతో తమ ఆస్తిని పిల్లలకు బహుమతిగా రాసిచ్చే తల్లిదండ్రులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. అలా రాసే గిఫ్ట్ డీడ్ లో తప్పనిసరిగా ఆ నిబంధన పొందుపరచాలని పేర్కొంది. ఒకవేళ ఆ నిబంధన లేకుంటే ఆ ప్రాపర్టీని తిరిగి వెనక్కి తీసుకోలేరని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కె కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సూచించింది. తమ బాగోగులు పట్టించుకోని పిల్లలపై సంబంధిత ట్రిబ్యునళ్లకు వెళ్లే హక్కు తల్లిదండ్రులకు ఉన్నప్పటికీ, ఈ తీర్పు మాత్రం తమ పిల్లలకు బహుమతిగా ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునే అంశంలో మాత్రమే వర్తిస్తుంది.
గుర్గావ్ కు చెందిన ఓ తల్లి తన ఆస్తిని ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడికి బహుమతిగా రాసిచ్చారు. అయితే, తన బాగోగులు పట్టించుకోకపోవడంతో తాను రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పు చెబుతూ గిఫ్డ్ డీడ్ రద్దు చేసింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పుతో ఏకీభవించింది. అయితే, సుప్రీంకోర్టు మాత్రం విభేదించింది. తన బాగోగులు చూడటం కోసం ఆ గిఫ్డ్ డీడ్ చేస్తున్నట్టు అందులో పొందుపరచలేదు కాబట్టి, దానిని రద్దు చేయడం కుదరదని పేర్కొంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది.
This website uses cookies.