Categories: TOP STORIES

ఇక సిటీ చుట్టూ హెచ్ఎండీఏ లేఅవుట్లు

  • రైతులు భూములు సేకరించి లేఔట్లు వేయాలని నిర్ణయం
  • దాదాపు వెయ్యి ఎకరాల సేకరణకు కసరత్తు

హైదరాబాద్ చుట్టు పక్కల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి వేలం ద్వారా చక్కని ఆదాయం ఆర్జిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్లియర్ టైటిల్, ఎలాంటి వివాదాస్పదం లేని భూములు కావడం, అన్ని అనుమతులూ ఉండటంతో హెచ్ఎండీఏ లేఔట్లకు డిమాండ్ భారీగా ఉంటోంది. ఇప్పటివరకు సర్కారు భూముల్లో పెద్ద పెద్ద ఫ్లాట్లు వేలం వేసిన సంస్థ.. తాజాగా నివాసయోగ్యమైన లేఔట్ల అభివృద్ధిపై దృష్టి సారించింది.

హైదరాబాద్ చుట్టూ వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించాలని యోచిస్తోంది. సిటీ చుట్టూ తనకు ఉన్న భూములతోపాటు ఆయా ప్రాంతాల్లో నివాసానికి అనుకూలమైన భూములను రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. అనంతరం వాటిని అన్ని విధాలా అభివృద్ధి చేసి మల్టీ పర్పస్ యూజ్ ప్లాట్లుగా ఏర్పాటు చేసి ఆన్ లైన్ బిడ్డింగ్ లో విక్రయించాలని ప్రణాళికలు రూపొందించింది. రైతుల నుంచి భూములు సేకరిస్తున్నందున మొత్తం ప్లాట్లలో 60 శాతం వారికి ఇస్తారు. మిగిలిన 40 శాతం ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయిస్తుంది.

ప్రస్తుతం మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇప్పటికే ఇలా కొన్ని భూములను సేకరించిన హెచ్ఎండీఏ.. వాటిలో సౌకర్యాల కల్పనను శరవేగంగా చేస్తోంది. అలాగే హైదరాబాద్ శివార్లలో కుర్మల్ గూడ; ప్రతాప సింగారం, దండు మల్కాపురం, నాదర్ గుల్ వంటి ప్రాంతాల్లో నిరుపయోగం ఉన్న భూములను గుర్తించి, ఆయా రైతులతో చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే నగరంలో భూముల ధరలు, ప్లాట్ల రేట్లు ఆకాశాన్నంటిన నేపథ్యంలో సిటీ చుట్టూ హెచ్ఎండీఏ వేసే వెంచర్లకు మంచి డిమాండ్ వస్తుందని భావిస్తున్నారు.

This website uses cookies.