Categories: LEGAL

ఎంపీ కేకే కుమారులపై కేసు

టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు కుమారులు కె.విప్లవకుమార్, కె.వెంకటేశ్వరరావుపై బంజారాహిల్స్ స్టేషన్ లో కేసు నమోదైంది. అమెరికాలో స్థిరపడిన ఓ ఎన్నారై మహిళకు చెందిన స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో సొంతం చేసుకున్నారనే ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయ్‌.

న్యూజెర్సీలో నివసిస్తున్న జి జయమాల 1983లో షేక్ పేట మండలంలో 939 గజాల స్థలాన్ని పి.సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి షేక్ అలీఖాన్ అహ్మద్ నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్థలాన్ని ఇరువురూ సగం సగం చొప్పున పంచుకున్నారు. ఈ మేరకు 469 గజాల స్థలం జయమాలకు వచ్చింది. కాగా, ఈ క్రమంలో గతేడాది నవంబర్ లో జయమాలకు ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చింది. 2013-14లో జరిగిన రూ.2.13 కోట్ల విలువైన స్థల విక్రయానికి సంబంధించి పన్ను చెల్లించలేదని.. ఇప్పుడు జరిమానాతో కలిసి రూ.1,40,41,300 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. దీంతో షాక్ గురైన జయమాల భర్త.. ఈ వ్యవహారంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడి బంధువుల ద్వారా ఆదాయపన్ను శాఖలో ఎంక్వైరీ చేశారు.
ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. 2013లో ఆ స్థలాన్ని ఎంపీ కేకే కుమారుడు విప్లవ్ కుమార్ తనను స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీగా పేర్కొంటూ తన అన్న వెంకటేశ్వరరావుకు రూ.3 లక్షలకు అమ్మినట్టు వెల్లడైంది. దీంతో తన సంతకం ఫోర్జరీ చేసి ఈ విక్రయం జరిపారని, అందువల్ల వారిపై కేసు నమోదు చేయాలని జయమాల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, అధికార పార్టీ ఎంపీ కుమారులపై కేసు నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించలేదు. దీంతో జయమాల అన్ని పత్రాలతో స్థానిక కోర్టును ఆశ్రయించారు. సంతకం ఫోర్జరీ చేసి ఆ స్థలాన్ని విక్రయించినట్టు నిర్ధారించిన కోర్టు.. ఎంపీ కుమారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

This website uses cookies.