* బహదూర్ పల్లి ప్రీబిడ్ మీటింగ్ సక్సెస్
* వంద మందికిపైగా హాజరైన ఔత్సాహికులు
* ఈ–ఆక్షన్ పద్దతులను వివరించిన ఎంఎస్టిసీ అధికారులు
* మార్చి 14, 15 తేదీల్లో జరుగనున్న ఆన్ లైన్ వేలం ప్రక్రియ
రెజ్ న్యూస్, హైదరాబాద్: బహదూర్ పల్లి లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) అభివృద్ధి చేస్తున్న లే అవుట్ లోని 101 ప్లాట్ల కొనుగోలుకు మంచి స్పందన వస్తున్నది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ లే అవుట్ లో 101 పాట్లను ఈ–ఆక్షన్ ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం బహదూర్ పల్లిలో మేకల వెంకటేశ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రీబిడ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 120 మంది ఔత్సాహికులు హాజరయ్యారు. బహదూర్ పల్లి లే అవుట్లో హెచ్ఎండిఏ చేసే అభివృద్ధి పనులు, మౌళిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాలను ఔత్సాహికులు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టిసి అడిషనల్ జనరల్ మేనేజర్ రేణుపురుషోత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీపీ) ద్వారా ఆన్ లైన్ వేలం(ఈ–ఆక్షన్)లో పాల్గొనేందుకు అవసరమైన విధివిధానాలను వివరించారు. మార్చి 14వ తేదీ, 15వ తేదీలలో బహదూర్ పల్లిలో 101 ప్లాట్లకు జరిగే ఈ–ఆక్షన్ లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలనే అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు లే అవుట్లో 80 అడుగులు, 60 అడుగులు, 40 అడుగుల రోడ్లు, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌళిక వసతులను హెచ్ఎండిఏ ఏడాదిన్నర కాలంలో ఏర్పాటుచేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ లే అవుట్ పరిసరాలు ఎంతో అభివృద్ధి చెందాయని, చుట్టు పక్కల రెండు విల్లా వెంచర్లు, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వంటివి ఉన్న విషయాలను గుర్తు చేశారు.
గత కొన్నేండ్లుగా హెచ్ఎండిఏ రూపొందించిన లే అవుట్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, గత రెండేండ్లలో కోకాపేట, ఉప్పల్ భగాయత్ ప్లాట్ల విక్రయాల ద్వారా హెచ్ఎండిఏ పట్ల ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యిందని తెలిపారు. ఎలాంటి భూవివాదాలకు ఆస్కారం లేకుండా భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా హెచ్ఎండిఏ లే అవుట్లు ఉండటం ఇందుకు నిదర్శనమని వివరించారు. ప్లాట్ల కొనుగోలు పెట్టుబడులకు హెచ్ఎండిఏ పెట్టినిల్లుగా మారిందన్నారు. బహదూర్ పల్లి లే అవుట్ మల్టీపర్పస్ జోన్ కిందకు వస్తుందని, ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్ యాక్టివిటీకి హెచ్ఎండిఏ అనుమతులు(పర్మిషన్స్) ఇస్తుందని తెలిపారు.
ప్రీబిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి, సెక్రెటరీ పి.చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, ప్లానింగ్ ఆఫీసర్ యశ్వంత్ రావు, సూపరింటెండెంట్ ఇంజినీర్ యూసుఫ్ హుస్సేన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రజిత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గౌతమి తదితరులు హాజరయ్యారు.