పురపాలక శాఖ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల నిమిత్తం 2022-23వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో భారీగా నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని సమాచారం. మౌలిక వసతులు, అభివృద్ధి పనులతో పాటు మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంకు (ఎంఆర్‌టిఎస్), మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఎస్టీపీలకు నిధుల్ని అధిక శాతంలో కేటాయించాలని భావిస్తోంది. ఏడేళ్లలో కేంద్ర సాయం చేయకున్నా పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జిహెచ్‌ఎంసికి ప్రత్యేక సాయాన్ని కేంద్రం అందించకపోయినా ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ, ఎస్‌ఎన్‌డీపీ వంటి అభివృద్ధి కార్యక్రమాల్ని విజయవంతంగా చేపడుతోంది.
నగరంలో రోడ్లు, నాలాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం జీహెచ్‌ఎంసి మునిసిపల్ -బాండ్లను జారీ చేసి కొంత వరకు వనరులు సమకూర్చుకోగా, మరోపక్క ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలను విజయవంతంగా సేకరిస్తూ అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా నిలిచింది. ఈ నిధులతో నగరంలోని రోడ్లు, పై ఓవర్లు, నాలాల మరమ్మతులను జీహెచ్‌ఎంసి చేపట్టగలిగింది. అయితే రాష్ట్రంలో ఒకే ఒక మిలియన్ ప్లస్ సిటీగా ఉన్న హైదరాబాద్ నగరానికి కేంద్రం నిధులు కేటాయిస్తే అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అర్భన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టియూఎఫ్‌ఐడిసి) అనే సంస్థకు ప్రభుత్వం వేల కోట్లలో మూల ధనాన్ని సమకూర్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలకు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం అండగా నిలుస్తోంది.
బడ్జెట్‌లో కేంద్రం నిధులివ్వాలని..
వేల కోట్ల రూపాయలతో పురపాలక శాఖ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులివ్వాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గతంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంకు (ఎంఆర్‌టిఎస్)కు రూ. 450 కోట్లు, రూ.11,500 కోట్లతో చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, రూ. 3,450 కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సాయం చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. ఇవి కాకుండా ఎస్టీపీల నిర్మాణం, మురుగునీటి డ్రైనేజీ నెట్‌వర్క్ నిర్మాణంతో పాటు ఔటర్ రింగురోడ్డు వరకు నిర్మించే ఎస్టీపీలకు మొత్తం రూ.8,684 కోట్లు ఖర్చవుతుండగా వీటిలో మూడోవంతు కేంద్రం ఇవ్వాలని గతంలో విజ్ఞప్తి చేశారు. రూ.2,400 కోట్లతో నగరంలో మిస్సింగ్ లింకు రోడ్ల నిర్మాణం చేపడుతుండగా దానికి రూ.800 కోట్లు ఇవ్వాలని వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నియో మెట్రోకు రూ.184 కోట్లను సాయం చేయాలని కోరారు.