Categories: TOP STORIES

పెట్టుబడులకు పెన్నిది హెచ్​ఎండిఏ ప్లాట్లు

* బహదూర్​ పల్లి ప్రీబిడ్​ మీటింగ్​ సక్సెస్​
* వంద మందికిపైగా హాజరైన ఔత్సాహికులు
* ఈ–ఆక్షన్​ పద్దతులను వివరించిన ఎంఎస్​టిసీ అధికారులు
* మార్చి 14, 15 తేదీల్లో జరుగనున్న ఆన్​ లైన్​ వేలం ప్రక్రియ

రెజ్ న్యూస్‌, హైదరాబాద్​: బహదూర్​ పల్లి లో హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (హెచ్ఎండిఏ) అభివృద్ధి చేస్తున్న లే అవుట్​ లోని 101 ప్లాట్ల కొనుగోలుకు మంచి స్పందన వస్తున్నది. మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా దుండిగల్​ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్​ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ లే అవుట్​ లో 101 పాట్లను ఈ–ఆక్షన్​ ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం బహదూర్​ పల్లిలో మేకల వెంకటేశ్​ ఫంక్షన్​ హాల్​ లో జరిగిన ప్రీబిడ్​ మీటింగ్​ జ‌రిగింది. ఈ సమావేశానికి దాదాపు 120 మంది ఔత్సాహికులు హాజరయ్యారు. బహదూర్​ పల్లి లే అవుట్​లో హెచ్​ఎండిఏ చేసే అభివృద్ధి పనులు, మౌళిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాలను ఔత్సాహికులు అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్​టిసి అడిషనల్​ జనరల్​​ మేనేజర్​ రేణుపురుషోత్తం పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​(పీపీపీ) ద్వారా ఆన్​ లైన్​ వేలం(ఈ–ఆక్షన్​)లో పాల్గొనేందుకు అవసరమైన విధివిధానాలను వివరించారు. మార్చి 14వ తేదీ, 15వ తేదీలలో బహదూర్ పల్లిలో 101 ప్లాట్లకు జరిగే ఈ–ఆక్షన్​ లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలనే అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు లే అవుట్​లో 80 అడుగులు, 60 అడుగులు, 40 అడుగుల రోడ్లు, ఎలక్ట్రిసిటీ, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ వంటి మౌళిక వసతులను హెచ్​ఎండిఏ ఏడాదిన్నర కాలంలో ఏర్పాటుచేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ లే అవుట్​ పరిసరాలు ఎంతో అభివృద్ధి చెందాయని, చుట్టు పక్కల రెండు విల్లా వెంచర్లు, మల్లారెడ్డి ఇంజినీరింగ్​ కాలేజీ వంటివి ఉన్న విషయాలను గుర్తు చేశారు.

గత కొన్నేండ్లుగా హెచ్ఎండిఏ రూపొందించిన లే అవుట్లకు ప్రజల నుంచి మంచి ఆద‌రణ ఉందని, గత రెండేండ్లలో కోకాపేట, ఉప్పల్​ భగాయత్​ ప్లాట్ల విక్రయాల ద్వారా హెచ్ఎండిఏ పట్ల ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యిందని తెలిపారు. ఎలాంటి భూవివాదాలకు ఆస్కారం లేకుండా భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా హెచ్ఎండిఏ లే అవుట్లు ఉండటం ఇందుకు నిదర్శనమని వివరించారు. ప్లాట్ల కొనుగోలు పెట్టుబడులకు హెచ్​ఎండిఏ పెట్టినిల్లుగా మారిందన్నారు. బహదూర్​ పల్లి లే అవుట్​ మల్టీపర్పస్​ జోన్​ కిందకు వస్తుందని, ఇందులో రెసిడెన్షియల్​, కమర్షియల్​ యాక్టివిటీకి హెచ్ఎండిఏ అనుమతులు(పర్మిషన్స్​) ఇస్తుందని తెలిపారు.

ప్రీబిడ్​ సమావేశానికి హెచ్ఎండిఏ చీఫ్​ ఇంజినీర్​ బిఎల్​ఎన్​ రెడ్డి, సెక్రెటరీ పి.చంద్రయ్య, ఎస్టేట్​ ఆఫీసర్​ గంగాధర్​, చీఫ్​ అకౌంట్స్​ ఆఫీసర్​ విజయలక్ష్మి, ప్లానింగ్​ ఆఫీసర్​ యశ్వంత్​ రావు, సూపరింటెండెంట్​ ఇంజినీర్​ యూసుఫ్​ హుస్సేన్​, ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ రజిత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ గౌతమి తదితరులు హాజరయ్యారు.

This website uses cookies.