Categories: LATEST UPDATES

గృహ బీమా, గృహ రుణ బీమా.. తేడాలివీ

బీమా అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. ప్రస్తుతం ప్రతి దానికీ బీమా ఉంటోంది. కానీ మనకు తెలిసింది మాత్రం జీవిత బీమా, వైద్య బీమా. చాలామంది ఈ రెండింటినే తీసుకుంటారు.

అయితే, ఇంటికీ బీమా ఉంటుందని.. ఇంటి మీద తీసుకున్న రుణానికి సైతం బీమా ఉంటుందని మీకు తెలుసా? గృహ బీమా, గృహ రుణ బీమాకు మధ్య తేడాలు తెలుసుకుంటే మీరు సరైన బీమా కవరేజీ పొందే అవకాశం ఉంటుంది. గృహ బీమా అనేది మీ ఇంటిని ఏదైనా నష్టం లేదా దొంగతనం నుంచి ఆదుకుంటుంది. మీరు ఆదాయాన్ని కోల్పోవడం లేదా అకాల మరణం కారణంగా గృహ రుణ ఈఎంఐ చెల్లించలేని పరిస్థితిలో ఉంటే గృహ రుణ బీమా అక్కరకొస్తుంది.

 

గృహ బీమా అంటే ఏమిటి?

ఇంటికి సంబంధించిన బీమా అనేది.. మీ ఇంటి వాస్తవ భౌతిక నిర్మాణానికి సంబంధించింది. అగ్నిప్రమాదం, దొంగతనం, తుఫానులు లేదా భూకంపాల వంటి ఊహించని సంఘటనల వల్ల సంభవించే నష్టం నుంచి ఇంటి నిర్మాణాన్ని కవర్ చేసే బీమా పాలసీ. ఉగ్రవాద కార్యకలాపాలు లేదా అల్లర్ల కారణంగా మీ ఇల్లు పాడైతే హోమ్ ఇన్సూరెన్స్ నుంచి నష్టపరిహారం పొందొచ్చు. వ్యక్తిగత వస్తువులతోపాటు దెబ్బతిన్న లేదా పొగొట్టుకున్న ఆస్తిని మరమ్మతులు లేదా భర్తీకి సంబంధించిన ఖర్చులు ఇందులో కవర్ అవుతాయి. అలాగే ఇల్లు నివాసయోగ్యంగా లేకపోతే తాత్కాలిక వసతి ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.

గృహ రుణ బీమా అంటే..?

పేరులో ఉన్నట్టుగానే గృహ రుణానికి సంబంధించిన బీమా ఇది. రుణదాతకు బకాయి ఉన్న హోమ్ లోన్ మొత్తాన్ని ఇది కవర్ చేస్తుంది. ఇది చాలావరకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ వంటిది. ఉద్యోగ నష్టం, ప్రమాదాలు లేదా మరణం వంటి ఊహించని సంఘటనల విషయంలో రుణగ్రహీత తదుపరి ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ లోన్ మొత్తం బీమా పాలసీ కింద కవర్ అవుతుంది. అంటే మిగిలి ఉన్న గృహ రుణ మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందన్నమాట.

This website uses cookies.