Categories: LATEST UPDATES

మోడల్ బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్ పై కమిటీ

రియల్ ఎస్టేట్ రంగంలో మోడల్ బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్ ఉండాలనే అంశంపై మరో ముందడుగు పడింది. కొనుగోలుదారుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ అంశంపై విధివిధానాలు రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

న్యాయమూర్తులతోపాటు జాతీయ, రాష్ట్ర వినియోగదారుల కమిషన్లు, వివిధ వినియోగదారుల సంస్థలు, లాయర్లు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వ్యక్తులతో వచ్చే మూడు నెలల్లోగా దీనిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. కొనుగోలుదారు, డెవలపర్ మధ్య తలెత్తే సమస్యలను సులభంగా పరిష్కరించడానికి మోడల్ బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్ దోహదపడుతుందన్నారు. ఇది ప్రత్యేకమైన డాక్యుమెంట్ అని.. దేశ్యవాప్తంగా ఒకే తరహా నిబంధనలు ఉంటాయని పేర్కొన్నారు. అందువల్ల కొనుగోలుదారు, బిల్డర్ల మధ్య తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి వీలవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో మోడల్ అగ్రిమెంట్ తయారీ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అందరితో విస్తృత సంప్రదింపుల తర్వాత మోడల్ అగ్రిమెంట్ రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని.. ఆ తర్వాత రాష్ట్రాలకు పంపిస్తామని వెల్లడించారు.

కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం మోడల్ అగ్రిమెంటు రూపొందించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ అనే లాయర్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న మోడల్ అగ్రిమెంట్లను బిల్డర్లు ప్రభావితం చేసే పరిస్థితి ఉందని.. పైగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా నిబంధనలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేవిధమైన మోడల్ అగ్రిమెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. డెవలపర్లు.. సామాన్యులకు తెలియని రకరకాల క్లాజులు వారు చేసుకునే ఒప్పందాల్లో చేర్చే అవకాశం ఉన్నందున.. కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు బిల్డర్-బయ్యర్ మోడల్ అగ్రిమెంటును రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్రాన్ని ఆదేశించింది.

This website uses cookies.