సొంతిల్లు అనేది ఎవరికైనా ఉండే అతి సాధారణ కోరిక. వ్యక్తిగత గోప్యత, భద్రత వచ్చేది సొంతింటితోనే. అందుకే ఇల్లు కొనుక్కోవాలనే కోరిక చాలామందికి మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. సాధారణ కోరికే అయినా.. అసాధారణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనడంలో సందేహం లేదు. ఒక మనిషి తన జీవితకాలంలో పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఇంటి పైనే. ఎక్కువ మొత్తంలో తీసుకునే రుణం కూడా గృహం కోసమే. ఈ నేపథ్యంలో ఇంటి కోసం రుణం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దామా? అన్నింటా మోసాలు జరుగుతున్నట్టే.. గృహరుణం మంజూరు పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయి. అందువల్ల దీనిపై ఓ అవగాహన ఉండటం ఎంతైనా అవసరమే. మరి ఆ జాగ్రత్తలేంటో ఓ లుక్కేద్దాం..
ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రోకర్ లేదా స్థలం యజమాని సూచించే బ్యాంకులో లోన్ తీసుకోవద్దు. మోసం జరగడానికి అవకాశం ఉంటుంది.
లోన్ తీసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ఉంటేనే బ్యాంకు రుణం ఇస్తుంది. లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ లోన్ రాదు.
మొత్తం ఆస్తి విలువలో 70 శాతం నుంచి 80 శాతం వరకు రుణం ఇస్తారు. అది కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో చూపించిన ఆస్తి విలువలో మాత్రమే ఇస్తారు. మార్కెట్ విలువలో కాదు. అందువల్ల మీకు కావాల్సిన లోన్ ను బట్టి రిజిస్ట్రేషన్ విలువ ఉండేలా చూసుకోవాలి.
ఒకవేళ లోన్ కోసం రిజిస్ట్రేషన్ విలువ పెంచి చూపిస్తే, రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి. అలాగే అమ్మేవారు ఆ సొమ్ముకు పన్ను కట్టాలి. మీరు కూడా అందుకు తగిన ఆదాయ వనరులు చూపించాలి.
బ్యాంకు లోన్ ఇవ్వడానికి ప్రోసెసింగ్ ఫీజు తీసుకుంటుంది. అది కనీసం రూ.10వేలు లేదా లోన్ మొత్తం 1.5 శాతం ఉండొచ్చు. బ్యాంకుకు, బ్యాంకుకు మధ్య వీటిలో తేడాలుంటాయి. ఇక లోన్ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కొన్ని బ్యాంకులు 5 శాతం కంటే ఎక్కువగానే బీమా ప్రీమియం వసూలు చేస్తున్నాయి. అందువల్ల ఇన్సూరెన్స్ ఎంతో తెలుసుకున్న తర్వాతే అందుకు అంగీకారం తెలపండి.
అన్ని సందర్భాల్లో ఆస్తిని బ్యాంకుకు తాకట్టు రిజిస్ట్రేషన్ ను చేయించాల్సిన పనిలేదు. దానికి బదులు ఆస్తి విలువలో 0.3 శాతం విలువ గల రెవెన్యూ స్టాంపు మీద లోన్ అగ్రిమెంట్ రాసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బ్యాంకరుతో వివరంగా మాట్లాడాలి. అవసరమైతే లాయరును, సీఏనో సంప్రదించాలి. లోన్ తొందరగా మంజూరు కావాలని బ్యాంకరు అడిగిన చోటల్లా సంతకం పెడితే దాని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.
ఆస్తి కొనుగోలుకు బ్యాంకు లోన్ తీసుకుంటే, రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు ఏజెంటు రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చి, సొమ్ముకు సంబంధించిన చెక్కు యజమానికి ఇచ్చి, ఆస్తికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళతారు. వారికి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేముందు నకళ్లు తీసుకుని మీ వద్ద ఉంచుకోండి.
బ్యాంకు లోన్ పని అంతా అయ్యేసరికి కనీసం 20 రోజులు పడుతుంది. ఒక వారంలో అయిపోతుంది అని బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినా నమ్మి రిజిస్ట్రేషన్ గడువు తక్కువ పెట్టుకోకండి. బ్యాంకరు నోటితో ఇచ్చిన హామీలు నమ్మి అగ్రిమెంటు చేసుకోకండి. అగ్రిమెంటు తర్వాత వివిధ కారణాలతో ముందు చెప్పినంత సొమ్ము, చెప్పిన సమయానికి ఇవ్వలేకపోవచ్చు. అది దృష్టిలో ఉంచుకునే అగ్రిమెంటు చేసుకోండి.
బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుంటే దానికి ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువగా ఉంటుంది. వడ్డీ కూడా అధికంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ మాత్రం ఆప్షనల్. మీకు ఇన్సూరెన్స్ వద్దనుకుంటే ముందే వద్దని చెప్పాలి.