సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారు గృహరుణం తీసుకోకుండా అడుగు ముందుకు వేయలేరు. వేతనజీవులైనా వ్యాపారులైనా తమ సమీపంలోని బ్యాంకును సంప్రదించి గృహరుణాన్ని అందుకుంటారు. లేదా ఏదైనా అపార్టుమెంట్ నచ్చితే.. ఆయా ప్రాజెక్టును ఆమోదించిన బ్యాంకు నుంచి అయినా రుణాన్ని తీసుకుంటారు. కొందరేమో నెలనెలా జీతం పడే బ్యాంకును ఆశ్రయిస్తారు. ఏదీఏమైనా, గృహరుణం లేనిదే అధిక శాతం మంది సొంతింటి కలను నెరవేర్చుకోలేరు. మరి, బ్యాంకును ఎంచుకునే ముందు చాలామంది గమనించే అంశం.. ఆయా బ్యాంకు వడ్డీ రేట్లు. ఈ క్రమంలో ఏయే బ్యాంకు ఎంతెంత వడ్డీ రేటును వసూలు చేస్తుందో.. రియల్ ఎస్టేట్ గురు పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
దేశంలో రానున్న పండుగల సీజన్‌లో భాగంగా, గృహ రుణాలను పొందేందుకు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంకులు ప్రత్యేక గృహ రుణ ఆఫర్‌లను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను 6.90 శాతం నుండి అందిస్తోంది. ఇది రూ.30 లక్షల వరకు గృహ రుణాలకు అందజేస్తోంది. రూ.30 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలకు 7 శాతానికే అందిస్తోంది.. బ్యాంక్ యొక్క యోనో మొబైల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు ఐదు బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు రాయితీని పొందుతారు. భారతదేశంలోని 8 మెట్రో నగరాల్లోని దరఖాస్తుదారులు రూ.3 కోట్ల వరకు గృహ రుణాలకు 20 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటులో రాయితీని పొందుతారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు గృహ రుణాలకు ఇది వర్తిస్తుంది. రూ.75 లక్షలకు పైబడిన గృహ రుణాలకు 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ ఉంటుంది. అన్ని వడ్డీ రేటు రాయితీలు దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్‌లతో అనుసంధానిస్తారు.