Categories: Uncategorized

ఇల్లు.. మరింత ఖరీదు?

రాబోయే సంవత్సరాలలో ఇల్లు కొనడం మరింత కష్టం కావొచ్చు. దేశంలో ఇళ్ల ధరలు మరింత పెరగనుండటమే ఇందుకు కారణం. అదే సమయంలో ఇల్లు కొనుగోలు చేసేవారి ఆర్థిక స్తోమత తగ్గడంతో సామాన్యుల సొంతింటి కల మరింత భారం కానుందని రాయిటర్స్ ప్రాపర్టీ విశ్లేషించింది.

ఇటీవల కాలంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పలుమార్లు పెంచి 6.5 శాతం చేసినా.. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, పటిష్టమైన హౌసింగ్ డిమాండ్ కారణంగా మన ప్రాపర్టీ మార్కెట్ జోరుగానే దూకుడు కొనసాగించింది. అయితే.. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఇళ్ల సగటు ధరలు 7 శాతం మేర పెరుగుతాయని అంచనా వేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఇళ్ల ధరలు 50 శాతం పెరగ్గా.. తర్వాత వాటి ధరలు తగ్గుముఖం పట్టడం లేదా స్తబ్దుగా ఉంటాయని చాలామంది భావించారు. కానీ వాస్తవానికి కరోనా తర్వాత సొంతిళ్లకు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇదే క్రమంలో ఇళ్ల ధరలు మరింత పెరుగుతాయని.. తద్వారా వాటి కొనుగోలు మరింత భారంగా పరిణమిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, మార్కెట్ ఆశావహంగా ముందుకు వెళుతుండటం, జీడీపీ అంచనా అధికంగా ఉండటం, ఆర్థిక వైవిధ్యం, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. పైగా అందుబాటు ధరలోని ఇళ్లు దొరకడం మరింత కష్టమవుతుందని చెబుతున్నారు. దేశంలో ఇళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, అందుకు తగిన సరఫరా లేకపోవడం ఆందోళనకరమని వివరిస్తున్నారు. పైగా రాబోయే ఏడాదిలో తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారి స్తోమత మరింత తగ్గుతుందని అంచనా వేశారు. అలాగే అద్దెలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

This website uses cookies.