- ఆమోదం తెలిపిన సీఆర్డీఏ
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మూడో విడత కింద అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అమరావతి ప్రాంతంలోని 20 లేఔట్లలో 48,218 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సూచించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 33వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో మొత్తం 20 లేఔట్లలో 1,134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించారు. వీటిలో ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మంది పేదలు ఉచితంగా ఇళ్ల పట్టాలు పొందనున్నారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 41(3), (4) ప్రకారం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి భూములను ఆ పరిధిలోకి తెచ్చింది. గతేడాది అక్టోబర్ లో అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి సీఆర్డీఏ బహిరంగ విచార నిర్వహించింది. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.