కమర్షియల్, రిసిడెన్షియల్ లేదా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. సదరు భవనం జీవిత కాలం ఎంతో చెప్పాల్సిందే. బిల్డింగ్ ప్లాన్ సమర్పించినప్పుడు ఆ భవనం ఎంతకాలం ఉంటుందనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు లక్నో డెవలప్ మెంట్ అథార్టీ (ఎల్డీఏ) స్పష్టం చేసింది. నాలుగు లేదా అంతకుమించి అంతస్తుల ఉన్న భవనాల విషయంలో ఈ షరతు విధించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో హజ్రత్ గంజ్ లో ఓ భవనం కూలి ముగ్గురు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉండే భవనాల సురక్షిత ప్రమాణాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలని అథార్టీ సూచించింది.
భవన సురక్షిత ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించేందుకు ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ బృందం అన్నింటిని పరిశీలించిన తర్వాత సదరు భవనం జీవితకాలం ఎంతో బిల్డింగ్ ప్లాన్ పై పేర్కొంటుంది. ఈ ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని ఎల్డీఏ యోచిస్తోంది. భవన నిర్మాణం పూర్తయ్యాక ఐదేళ్ల అనంతరం తొలి బిల్డింగ్ ఆడిట్ నిర్వహిస్తారని ఎల్డీఏ వైస్ చైర్మన్ ఇంద్రామణి తెలిపారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా భవన ఆడిట్ జరుగుతుందని.. భవన మరమ్మతులకు అయ్యే ఖర్చును సదరు డెవలపర్ లేదా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ భరించాలని పేర్కొంది.