విశాఖపట్నంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. భూముల విలువతోపాటు రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతూ సర్కారు తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో భూముల విలువ దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. కూర్మన్నపాలెం, యందాడ, ఆనందపురం, తాళ్లవలస, సొంతాయం, రామవరం తదితర ప్రాంతాల్లో అయితే 50 శాతం వరకు పెరిగాయి. ఫ్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెరిగాయి. దీంతో అటు భూముల ధరలకు రెక్కలు రావడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా తడిసి మోపెడవుతున్నాయి.
వైజాగ్ ను ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడి భూముల ధరలు పెరిగాయి. ప్రధానంగా అచ్యుతాపురం, భీమిలి, ఆనందపురంప, కూర్మన్నపాలెం, సబ్బవరం, పెందుర్తి తదితర ప్రాంతాల్లో భూములకు డిమాండ్ పెరిగింది. అయితే, రాజధాని తరలింపుపై అనిశ్చితి కొనసాగుతుండటంతో మార్కెట్ స్తబ్దుగా మారింది. అయినప్పటికీ ధరలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో భూముల విలువను సవరిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం రియల్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని బిల్డర్లు, రియల్టర్లు హెచ్చరిస్తున్నారు. భూముల విలువ పెంపు కారణంగా మధ్యతరగతి ప్రజలు స్తిరాస్థి కొనుగోళ్లకు వెనకాడతారని చెప్పారు. ఇప్పటికే నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలత కారణంగా ఇళ్ల నిర్మాణం మరింత ఖరీదు కాగా, తాజాగా భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు సామాన్యుడి సొంతింటి కలను మరింత దూరం చేస్తుందని క్రెడాయ్ ఏపీ చాప్టర్ ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
This website uses cookies.