Categories: LEGAL

గేటెడ్‌ కమ్యూనిటీ పేరుతో రోడ్డు మూసివేత సరికాదు

  • ఆ గోడను కూల్చివేయండి
  • షాద్ నగర్ మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశం

గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ప్రజలు ఇతర లేఅవుట్లకు వెళ్లకుండా గోడ కట్టి రోడ్డును మూసివేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో డెవలపర్ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టింది. గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి మున్సిపల్ అనుమతి తీసుకోలేదని గుర్తించిన న్యాయస్థానం.. వెంటనే ఆ గోడను కూల్చివేసి రోడ్డుపై రాకపోకలకు వీలు కల్పించాలని షాద్ నగర్ మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించిన శ్రీ సాయి బాలాజీ టౌన్ షిప్ వెల్ఫేర్ సొసైటీ పిటిషన్ ను తోసిపుచ్చింది.

టౌన్ షిప్ డెవలపర్.. షాద్ నగర్ మున్సిపాలిటీలోని ఫరూక్ నగర్ మండలం సోలిపూర్ గ్రామంలో 83 ఎకరాల్లో డీటీసీపీ అనుమతితో ఓ లేఅవుట్ అభివృద్ధి చేశారు. అయితే, అక్కడి నుంచి ఇతర లేఅవుట్లకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి రాకపోకలు నిలిపివేయించారు. దీనిపై స్థానికులు, ఇతర లేఅవుట్ వాసులు కోర్టుకు వెళ్లారు. రికార్డులు పరిశీలించిన సింగిల్ జడ్జి.. ఆ గేటెడ్ కమ్యూనిటీకి అనుమతులు తీసుకోలేదని నిర్ధారించారు. దీంతో ఫ్లాట్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ గోడ కూల్చివేస్తామని డెవలపర్ కోర్టుకు హామీ ఇచ్చారు.

కానీ ఆ పని చేయలేదు. రెండు ఎకరాల మేర రోడ్డును ఆక్రమించారని నిర్ధారించి ఆ మేరకు చట్టపరమైన చర్యలకు అధికారులు ఉపక్రమించారు. దీంతో ప్లాట్ యజమానులు జోక్యం చేసుకుని.. తమను డెవలపర్ మోసగించారని, తమ ప్రయోజనాలను పరిరక్షించేందుకు రోడ్డ మూసివేతను అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ప్రజలకు ఉపయోగపడే రోడ్డును మూసివేయడం సరికాదని కోర్టు పేర్కొంటూ.. వారి పిటిషన్ ను తోసిపుచ్చింది. వెంటనే ఆ గోడను కూల్చివేసి రాకపోకలు పునరుద్ధరించాలి అధికారులను ఆదేశించింది.

This website uses cookies.