Categories: TOP STORIES

ఏపీలో ఎన్ని ఇళ్లు అమ్ముడ‌య్యాయి?

టాప్-30 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 11 శాతం పెరుగుదల

ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి

దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాల్లో టైర్-2 నగరాలు హవా చూపించాయి. 30 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 11 శాతం మేర పెరిగి 2.08 లక్షల యూనిట్లకు చేరుకున్నట్టు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఆర్థిక పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి, ఇల్లు కొనుక్కోవాలనే ఆకాంక్ష పెరగడం వంటి అంశాలు ఇళ్లకు డిమాండ్ పెరగడానికి కారణాలని పేర్కొంది.

దేశంలోని 30 ప్రధాన టైర్-2 నగరాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,07,896 ఇళ్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు 1,86,951గా ఉన్నాయి. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో 80 శాతం విక్రయాలు కేవలం 10 నగరాల్లోనే జరగడం గమనార్హం. అహ్మదాబాద్, వడోదర, సూరత్, నాసిక్, గాంధీనగర్, జైపూర్, నాగ్ పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, మొహలిల్లో 2023-24లో 11 శాతం పెరుగుదలతో 1,68,998 ఇళ్లు అమ్ముడుకాగా, అంతకు ముందు సంవత్సరంలో 1,51,706 యూనిట్లు విక్రయమయ్యాయి. మొత్తమ్మీద ఈ మొత్తం అమ్మకాల్లో 70 శాతం వెస్ట్ జోన్ లోనే ఉన్నాయి.

విశాఖలో 2022-23లో 5525 ఇళ్లు అమ్ముడుకాగా, 2023-24లో 5548 ఇళ్లు అమ్ముడయ్యాయి. అలాగే విజయవాడలో 2022-23లో 2585 ఇళ్లు, 2023-24లో 2590 ఇళ్లు అమ్ముడయ్యాయి. గుంటూరులో 2022-23లో 1814 ఇళ్లు విక్రయం కాగా, తదుపరి ఏడాది 1763 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ప్రాపర్టీ ధరలు తక్కువగా ఉండటం, వృద్ధి సంభావ్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇల్ల అమ్మకాల్లో టైర్-1 నగరాల కంటే టైర్-2 నగరాలు చక్కని పనితీరు కనబరిచినట్టు ప్రాప్ ఈక్విటీ ఫౌండర్, ఎండీ సమీర్ జసుజా పేర్కొన్నారు. అలాగే పెరుగుతున్న మధ్యతరగతి జనాభాకు అందుబాటు ధరలో సొంతింటి కల నెరవేరడం అక్కడే సాధ్యమవుతోందన్నారు. అంతేకాకుండా ఆయా నగరాల్లో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, పరిశ్రమలు రావడంతో ఆర్థిక ప్రగతి కూడా జరుగుతోందని వివరించారు.

This website uses cookies.