Categories: TOP STORIES

టెస్లా కార్ షోరూం అద్దె ఎంత అవుతుంది?

ఎలాన్ మస్క్ కి చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లా.. భారత్ లో ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీ, ముంబైలలో రెండు షోరూంలు ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ నిర్ణయించింది. రెండో చోట్లా 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షోరూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి ఆ షోరూంలకు అద్దె ఎంత అవుతుందో చూద్దామా?

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీ ప్రాంతం.. షోరూం ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం అని టెస్లా భావిస్తోంది. అలాగే ముంబైలో విమానాశ్రయానికి సమీపంలో ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో స్పేస్ ఎంచుకున్నట్టు సమాచారం. షోరూంల ప్రారంభానికి సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. భారత్ లో ఇంపోర్టెడ్ ఈవీలను విక్రయించడం కోసం ఈ రెండు షోరూంలను టెస్లా ప్రారంభించనుంది. వీటిని నేరుగా టెస్లాయే నిర్వహిస్తుంది. ఇక కార్ షోరూం అద్దెలు ప్రధానంగా లొకేషన్ పై ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో కార్ షోరూం అద్దె.. అంతస్తు, భవనం, ప్రాజెక్టు, లొకేషన్ బట్టి చదరపు అడుగుకు రూ.700 నుంచి రూ.800 వరకు ఉంటుంది.

ఆ లెక్కన 5వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియాకు నెలకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఢిల్లీలోని ఏరోసిటీలో షోరూమ్ అద్దెలు లొకేషన్‌ను బట్టి చదరపు అడుగుకు రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటాయని అంచనా. దీనిని బట్టి చూస్తే ఇక్కడ 5వేల చదరపు అడుగుల షోరూం కోసం రూ.25లక్షల నుంచి రూ.30 లక్షల మేర అద్దె చెల్లించాల్సి ఉంటుంది. న్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఇది చదరపు అడుగుకు రూ.600 కంటే ఎక్కువగా ఉండవచ్చు. సాధారణంగా లగ్జరీ కార్ల తయారీదారులు ప్రధాన రహదారి వెంబడే షోరూం ఉండాలని కోరుకుంటారు. మెర్సిడెస్, బీఎండబ్ల్యూ సహా అనేక ప్రపంచ ఆటో బ్రాండ్‌లు గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డు వెంబడి షోరూమ్‌లను కలిగి ఉన్నాయి. ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు నివసించే ప్రాంతం. అందువల్లే ఇలాంటి ప్రాంతాలనే అవి ఎంపిక చేసుకుంటాయి.

This website uses cookies.