అధికారికంగా అనుమతులు రాకుండానే నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు ప్రారంభించిన బిర్లా ఎస్టేట్స్ పై రెరా కన్నెర్రజేసింది. రెరా చట్టంలోని కీలక నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.50 లక్షల జరిమానా విధించింది. గుర్గావ్ లోని 31, 32 ఏ సెక్టార్లలో బిర్లా ఎస్టేట్స్ బిర్లా అకీరా పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. దీనికి పూర్తి స్థాయిలో అనుమతులు రాకముందే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించినట్టు హర్యాన రెరా గుర్తించింది. రెరా చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం రెరాలో రిజిస్టర్ చేసుకోకుండా ఆ ప్రాజెక్టును మార్కెటింగ్ చేయడం విరుద్ధం.
కానీ ఇక్కడ బిర్లా ఎస్టేట్స్ వాటిని ఉల్లంఘించింది. దీంతో రెరా ఆ సంస్థపై రూ.50 లక్షల జరిమానా విధించింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే.. మిగిలిన డాక్యుమెంటేషన్, ఆన్ లైన్ డీపీఐ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొంది. మరోవైపు ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంలో విఫలమైన ముగ్గురు బిల్డర్లకు కూడా హర్యానా రెరా రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించింది. అలాగే రిజిస్ట్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరుగురు డెవలపర్లకు చెందిన రూ.2.2 కోట్లను సీజ్ చేసింది.
This website uses cookies.