మీ దగ్గర 10 లక్షల డాలర్లు ఉంటే ముంబైలో ఎంత విస్తీర్ణంలో ఉన్న ఇల్లు వస్తుందో తెలుసా? కేవలం 1065 చదరపు అడుగుల ఇల్లు మాత్రమే. అంటే ఓ సాధారణ 2 బీహెచ్ కే ఇల్లు ముంబైలో కొనాలంటే దాదాపు రూ.9 కోట్లు ఉండాలన్న మాట. అదే దేశ రాజధాని ఢిల్లీలో దీనికి రెట్టింపు ఇల్లు వస్తుంది. హస్తినలో రూ.9 కోట్లతో 2238 చదరపు అడుగుల ఇల్లు కొనొచ్చు. ఈ మేరకు వివరాలను నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ముంబైలో ఇళ్ల ధరలు పెరుగుతున్నందున గతేడాది కంటే 3 శాతం తక్కువ పరిమాణంలో ఉన్న ఇల్లు మాత్రమే వస్తుందని వివరించింది. 2024లో 10 లక్షల డాలర్లతో 1097 చదరపు అడుగులు ఇల్లు రాగా, ఇప్పుడు అది 1065 చదరపు అడుగులకు తగ్గింది.
ముంబైతో పోలిస్తే ఢిల్లీలో 2238 చదరపు అడుగులు, బెంగళూరులో 3982 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు వస్తుందని తెలిపింది. ఇక మోనాకో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా తన ప్రస్థానం కొనసాగిస్తోంది. ఇక్కడ 10 లక్షల డాలర్లతో 204 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగలు చేయొచ్చు. తర్వాతి స్థానాల్లో హాంకాంగ్ (235 చదరపు అడుగులు), సింగపూర్ (344 చదరపు అడుగులు) ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడడంతో ఈ నగరాల స్తోమత కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. దీనికి విరుద్ధంగా ఢిల్లీ, బెంగళూరుల్లో ప్రైమ్ ప్రాపర్టీ ధరల పెరుగుదల నిలకడగా ఉంది. ఇది కొనుగోలుదారులకు అనుకూలంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు.
లగ్జరీ ఇళ్ల ధరల పెరుగుదలలో ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ 18వ స్థానంలో ఉండగా.. ముంబై 21వ స్థానంలో, బెంగళూరు 40వ స్థానంలో ఉన్నాయి. 2023లో 37వ స్థానంలో ఉన్న ఢిల్లీ.. 2024లో 18వ స్థానానికి వచ్చింది. బెంగళూరు కూడా 59వ స్థానం నుంచి 40వ స్థానానికి రాగా.. ముంబై మాత్రం 13 స్థానాలు కోల్పోయి 21వ స్థానానికి పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్ లో 18.4 శాతం వార్షిక వృద్ధితో సియోల్ అగ్రస్థానంలో ఉండగా, 2023లో టాప్ లో ఉన్న మనీలా 17.9 శాతం వృద్ధితో రెండో స్థానానికి పడిపోయింది. దుబాయ్ (16.9 శాతం), రియాద్ (16 శాతం), టోక్యో (12.1 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్‌లో ఢిల్లీ, బెంగళూరు అద్భుతమైన వృద్ధిని ప్రదర్శించాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ అన్నారు. మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థిక వృద్ధి, లగ్జరీ ఆస్తులకు పెరిగిన డిమాండ్ కారణంగా ఈ నగరాల ఆకర్షణ సైతం మరింత పెరిగిందని చెప్పారు.
This website uses cookies.