టూరిజంపరంగా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న దుబాయ్ తో మన ఐటీ నగరం బెంగళూరు పోటీ పడుతోంది. అయితే, ఇక్కడ పోటీ టూరిజంలో కాదు.. అద్దెల్లో.. బెంగళూరులో అద్దెలు మామూలుగా పెరగలేదు. దీంతో ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అద్దెలు పెరిగిపోయాయ్ బాబోయ్ అని అద్దెదారులు బాధపడుతుంటే.. పెట్టుబడిదారులు మాత్రం అక్కడ అద్దె ఆదాయం ఎలా ఉందా అని ఆరా తీసే పనిలో పడ్డారు. పెట్టుబడులకు బెంగళూరు మంచిదా లేక దుబాయ్ నా అని అన్వేషిస్తున్నారు. బెంగళూరులో విపరీతంగా పెరుగుతున్న అద్దెలను నెటిజన్లు దుబాయ్ తో పోల్చి చూస్తున్నారు.
బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల్లో.. ముఖ్యంగా వైట్‌ఫీల్డ్, కోరమంగళ, ఇందిరానగర్ వంటి ఐటీ హబ్‌లలో అద్దె పెరుగుదలపై చాలా మంది అద్దెదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్‌లతో సమానంగా జీతాలు సంపాదిస్తున్నప్పటికీ.. బెంగళూరులో జీవన వ్యయం ఆదాయ వృద్ధి కంటే వేగంగా పెరుగుతోందని.. గృహాలను భరించలేనిదిగా మారుస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సరఫరా-డిమాండ్ లో అసమతుల్యత కారణంగా కోరమంగళ, ఇందిరానగర్, హెచ్ఎస్ ఆర్ లేఅవుట్, ఉత్తర బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో అద్దెలు 30 శాతం నుంచి 40 శాతం మేర పెరిగాయి.
దీంతో చాలా మంది బెంగళూరులో జీవన వ్యయాన్ని సమతుల్యం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, మరికొందరు పెరుగుతున్న ఆర్థిక భారం కారణంగా నగరంలో ఉండటాన్ని కూడా పునరాలోచించుకుంటున్నారని చెబుతున్నారు. బెంగళూరులో మంచి మధ్యతరగతి జీవనశైలిని కొనసాగించడానికి నెలకు కనీసం రూ.55,000-60,000 సంపాదించాల్సిందేనని అంటున్నారు. దుబాయ్ లోనూ అద్దెలు ఎక్కువగా ఉన్నా.. షార్జాలో కాస్త బెటర్. అక్కడ రూ.70వేలకు మంచి అపార్ట్ మెంట్ దొరుకుతుంది. అధిక జీవన వ్యయం ఉన్నప్పటికీ, దాని అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పన్ను రహిత ఆదాయం కారణంగా దుబాయ్ అనేది భారతీయులకు అగ్ర పెట్టుబడి ఎంపికగా ఉందని నిపుణులు అంటున్నారు.
బెంగళూరులో, సాధారణ అద్దె దిగుబడి అనేది ప్రాంతం, ఆస్తి రకాన్ని బట్టి 3-4.5% ఉంటుంది. అయితే, దుబాయ్‌లో పెట్టుబడి స్థానంతో సంబంధం లేకుండా 7% కనీస అద్దె ఆదాయం వస్తుంది. ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన అవకాశంగా మారుతోందని నిపుణులు అంటున్నారు. జుమేరా లేక్ టవర్స్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, జుమేరా విలేజ్ సర్కిల్, దుబాయ్ ప్రొడక్షన్ సిటీ, దుబాయ్ సౌత్ వంటి ప్రముఖ ప్రాంతాలు వృద్ధిని కొనసాగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
This website uses cookies.