వర్షాకాలం.. ఎంత ఆహ్లాదకరమో, కొన్నికొన్ని విషయాల్లో అంతే ఇబ్బంది పెట్టే కాలం. వర్షం పడుతున్న సమయంలో బాల్కనీలో కూర్చుని స్నాక్స్ తింటూ వేడి వేడి టీ తాగుతుంటే వచ్చే ఆ మజాయే వేరు. అయితే, అదే సమయంలో వర్షాకాలం వల్ల మన ఇంటికి కొన్ని నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ కాలంలో మన ఇంటిని ఎలా సంరక్షించుకోవాలో కొన్ని చిట్కాలు మీకోసం..
క్రిమిసంహారకాలు తప్పనిసరి..
తేమ, అధిక తడి వల్ల అన్ని రకాల దోమలు, బొద్దింకలు, జలగల వంటి పలు కీటకాలు ఇళ్ల పగుళ్లలో సంతానోత్పత్తి చేసే అవకాశం ఉంది. వీటి కారణంగా మనం అనారోగ్యం బారిన కూడ పడే చాన్స్ ఉంటుంది. అందువల్ల ఇంటిని శుభ్రం చేయడానికి క్రిమసంహారకాలు ఉపయోగించడం తప్పనిసరి. మీ ఇంటిని వీలైనంత వరకు పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఎప్పటికప్పుడు మూలల్లో ఉండే సాలెపురుగులను తీసేయండి.
ఇల్లు అంతటా అసంఖ్యాకమైన పగుళ్లు ఉంటాయి. అలాగే గోడలు, పైకప్పు వెంట చిన్న చిన్న చీలికలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షపు నీరు లోపలకు రాకుండా చూసేందుకు ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయోమే పరిశీలించండి. ఆపై వాటికి పుట్టీ లేదా ఇతరత్రా లీకేజీ నిరోధక మెటీరియల్ ఉపయోగించి పగుళ్లను పూడ్చండి.
తేమ పుస్తకాలకు ఎంత నష్టం కలిగిస్తుందో పాఠకాసక్తి కలిగినవారికి మాత్రమే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పుస్తకాలను అల్మారాలు, కప్ బోర్డుల్లో ఉంచి తేమ చొరబడకుండా మూసివేడమే అత్యుత్తమ మార్గం. వాటితోపాటు కొన్ని నాప్తలీన్ గోళీలు అందులో ఉంచడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది.
భారీ వర్షాల కారణంగా చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల డ్రైనేజీలు తరచుగా బ్లాక్ అవుతాయి. అలాగే అధిక తేమ దోమలు, ఇతర కీటకాలతోపాటు ఎలుకలకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో డ్రైనేజీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నీరు సులభంగా పారేలా చూసుకోవాలి.
కుండపోత వర్షాల వల్ల ముందుగా ప్రభావితమయ్యేది పైకప్పులే. అందువల్ల పైకప్పును క్షుణ్ణంగా పరిశీలించాలి. పగుళ్లున్నా.. లీకేజీలు అయ్యే అవకాశం ఉన్నా వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల పైకప్పులను వాటర్ ప్రూఫ్ చేయించండి. మాస్టర్ సీల్, క్రిటోనైట్, డాక్టర్ ఫిక్సిట్ వంటి సమర్థవంతమైన వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్లను వినియోగించండి.
వర్షాకాలం అనేది పంగస్ త్వరగా వృద్ధి చెందే కాలం. అందువల్ల అది ఎక్కడ పెరుగుతుందో గుర్తించి వాటిని నివారించడం అత్యావశ్యకం. అత్యంత తేమగా ఉండే ప్రదేశాల్లో ఫంగస్ పెరుగుతుంది. వెంటనే వాటిని గుర్తించి నివారణ చర్యలు తీసుకోండి.
రగ్గులు, తివాచీలకు వర్షాకాలం తగిన సమయం కాదు. అయితే, తడి కారణంగా నాచు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దుర్వాసన కూడా రావొచ్చు. ఈ నేపథ్యంలో రగ్గులు, తివాచీలను తీసేసి మూటగట్టి దూరంగా ఉంచడం మంచిది.
వర్షాకాలం గొడుగు అత్యంత అవసరమైన సాధనం. వాటిని ఉంచడానికి వీలైన స్టాండ్ ను మీ ఇంటి ముందు ప్రవేశ ద్వారం ఉంచడం మరచిపోకండి. తద్వారా ఎవరైనా లొపలకు వచ్చినప్పుడు గొడుగు అక్కడ పెట్టి రావడం వీలవుతుంది. దీంతో గొడుగు మీద ఉండే నీళ్లు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
వర్షాకాలంలో బయట వాతావరణం మేఘావృతమై, వెలుతురు తక్కువగా ఉంటుంది. ఫలితంగా కిటికీల ద్వారా ప్రసరించే సూర్యకాంతి చాలా పరిమితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీ కర్టెన్లు అవసరం లేదు. అందువల్ల వాటిని తొలగించి, తేలికైన, పారదర్శకమైన కర్టెన్లను ఏర్పాటు చేయండి.
వర్షాకాలంలో వెదురు ఫర్నిచర్ ఉపయోగించడం మంచిది. చెక్కతో ఉన్న ఫర్నిచర్లను వెదురుతో రీప్లేస్ చేయండి. ఎందుకంటే అవి తక్కువ తేమను గ్రహిస్తాయి. దీంతో నాచు పెరుగుదల ఉండదు. ఇక కొత్తగా ఫర్నిచర్ తీసుకోవాలని భావిస్తే.. ప్రస్తుతానికి దానిని వాయిదా వేయండి. అలాగే మీ చెక్క ఫర్నిచర్ ను గోడలకు కొన్ని అంగుళాల దూరంలో ఉంచండి.
వానలు దుర్వాసనను కూడా తీసుకొస్తాయి. వాటిని అధిగమించడానికి చాలా చిన్న చిట్కా పాటిస్తే చాలు. ఇల్లు అంతటా సిట్రస్, తేలికపాటి సువాసనలు కలిగిన కొవ్వొత్తులు ఉంచితే సరి.
ప్రస్తుతం అనేక రకాల తేమ నిరోధక ఎక్స్ టీరియర్ పెయింటింగ్స్ అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల షేడ్లలో వచ్చేవాటిని వినియోగించి మీ ఇంటి బయట పెయింటింగ్ వేయించడం వల్ల మీ ఇల్లు వర్షాలకు తట్టుకోవడమే కాకుండా మీ ఇంటి ఉష్ణోగ్రతను 5 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. లీటర్ పెయింట్ రూ.250 నుంచి రూ.450 మధ్యలో దొరుకుతుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఈ వర్షాకాలన్ని మీరు చాలా బాగా ఆస్వాదించి, ఎలాంటి సమస్యలూ లేకుండా బయటపడతారు.
This website uses cookies.