సాహితీ సంస్థ వద్ద ప్రీలాంచ్లో ఫ్లాట్లు కొన్నవారు ఆందోళనలు చేశారు. ధర్నాలు నిర్వహించారు. సైటు వద్ద నిరహార దీక్షలు చేశారు. పోలీసులకు వినతి పత్రాల్ని సమర్పించారు. అయినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం.. ఎందుకు హఠాత్తుగా సాహితీ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను అరెస్టు చేసింది? ఈ స్కాం తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో నిర్ణయం తీసుకుందా? అయితే, తమ కష్టార్జితాన్ని సాహితీ సంస్థలో పోసిన కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటి? వారు పెట్టిన సొమ్మును ప్రభుత్వం వెనక్కి ఇప్పిస్తుందా? ఇలాంటి స్కాములు భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి?
బయ్యర్ల నుంచి సొమ్మును లాగేంత వరకూ కళ్లు మూసుకున్న ప్రభుత్వం.. అరెస్టు చేసి చేతులు దులిపేసుకుంటే అప్రతిష్ఠపాలయ్యే ప్రమాదముంది. అందుకే, ఈ కేసును కాస్త లోతుగా పరిశోధించి.. సాహితీ ఎండీ లక్ష్మీనారాయణ వసూలు చేసిన రూ.900 కోట్ల సొమ్మును ఎలా ఖర్చు చేశాడో తెలుసుకుని.. 2500 మంది బాధితులకు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రియల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏం చేయాలంటే..
సత్యం స్కామును పరిష్కరించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా.. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని నియమించాలి.
ఈ బృందం సాహితీ సంస్థకు సొమ్ము కట్టిన వారి పూర్తి వివరాల్ని సేకరించాలి.
మొత్తం ఎంతమందికి సొమ్ము చెల్లించాల్సి ఉంటుందో ఆరా తీయాలి.
ఏయే ప్రాజెక్టుల్లో ఎంతెంత మంది ఫ్లాట్లు కొన్నారో తెలుసుకోవాలి.
ఆయా ప్రాజెక్టులు ప్రస్తుత నిర్మాణ స్థాయిని అంచనా వేయాలి. అవి పూర్తి కావాలంటే ఇంకా ఎంత కాలం పడుతుంది? ఇందుకోసం అయ్యే ఖర్చెంత? అమ్ముడు కాకుండా మిగిలిన ఫ్లాట్లు ఎన్ని? వాటిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో ఆయా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చా అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి.
ఇప్పటికే ఫ్లాట్ల కోసం అడ్వాన్సులు ఇచ్చినవారిలో ఇంకా ఎంతమంది మిగతా బకాయిలు చెల్లించాలో తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఒక ఎస్క్రో ఖాతాను ఆరంభించి.. ఆయా నిర్మాణాన్ని వేరే బిల్డర్ లేదా కాంట్రాక్టరుకు అప్పగించి పూర్తి చేసే బాధ్యతను అప్పగించాలి. ఆయా ప్రాజెక్టులో ఏమైనా అదనపు సొమ్ము వస్తే.. ఆయా సొమ్ముతో మిగతా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వినియోగించాలి. ఇలా, సాహితీ సంస్థ ఆరంభించిన ప్రాజెక్టులన్నింటినీ పక్కాగా గమనించి.. వాటి తాజా స్థితిగతిని అంచనా వేసి.. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి.. సాహితీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. లేకపోతే, రానున్న రోజుల్లో ఈ అంశం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించే ప్రమాదముంది. ఇందులో ఫ్లాట్లు కొని మోసపోయినవారే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమిప్పే అవకాశం లేకపోలేదు. అలా జరగకుండా ఉండాలంటే, ప్రభుత్వమే బాధితులకు అండగా నిలవాలి. వారి సొమ్మును వెనక్కి ఇప్పించాలి. లేక ఫ్లాట్లను కట్టించి ఇవ్వాలి.
ఇప్పటికైనా, హైదరాబాద్‌లో ప్రీలాంచ్ ప్రాజక్టులను చేపడుతున్న ఇతర కంపెనీల వివరాల్ని సేకరించాలి. ఇందుకోసం రెరా అథారిటీలో కొత్త సిబ్బందిని నియమించాలి.
ప్రీలాంచ్ సంస్థలకు నోటీసులను పంపాలి. ఎక్కడ ప్రాజెక్టులను చేపడుతున్నారు? భూమిని కొన్నారా? లేదా? లేక డెవలప్‌మెంట్ నిమిత్తం తీసుకున్నారా? అయితే, స్థల యజమానికి ఎంత సొమ్ము ఇచ్చారు? అనుమతుల పరిస్థితి ఏమిటి? వంటి వివరాల్ని కనుక్కోవాలి.
నగరంలో ఉన్న ప్రీలాంచ్ ప్రాజెక్టులపై రెరా అథారిటీ ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. రెరా చట్టం ప్రకారం తీసుకోవాల్సిన కఠిన చర్యల్ని వెంటనే తీసుకోవాలి. ఇలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తే తప్ప భవిష్యత్తులో ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని అరికట్టలేని దుస్థితి ఏర్పడుతుంది.