ఒకప్పుడు ఉద్యోగం రాగానే పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ తరువాత ఇల్లు కొనుక్కోవాలన్న దృక్పథం కనిపించేది. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. ఉద్యోగం రాగానే ముందు ఇల్లు కొనుగోలు చేస్తోంది నేటి యువత. ప్రస్తుతం హైదరాబాద్ సహా భారత్ లోని ప్రధాన మెట్రో నరగాల్లో ఇల్లు కొనుగోలు చేస్తున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారుతున్నాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగంలో చేరగానే యువత ముందుగా సొంతింటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. మంచి ఉద్యోగం, భారీ ప్యాకేజీతో వేతనం ఉండటంతో బ్యాంక్ లోన్ తో ఈజీగా ఇంటిని కొంటున్నారు. స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు భారీగా ఆసక్తి చూపుతున్నారు. 2018లో గృహ కొనుగోలుదారుల్లో 25–35 ఏళ్ల వయస్సు గలవారి వాటా 28 శాతం ఉండగా, గతేడాది 2024కి అది 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి ఇల్లు కొనుగోలు చేసే యువత వాటా 60 శాతానికి చేరుతుందని జేఎల్‌ఎల్ ఇండియా అంచనా వేసింది.
కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే వెసులుబాటును కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్‌ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా జేఎల్ఎల్ అంచనా వేసింది.
This website uses cookies.