సామాన్యుడి నుంచి మొదలు ధనవంతుల వరకు తమ కలల గృహాన్ని వారి బడ్జెట్ మేరకు, వారి వారి అభిరుచి ప్రకారం ఉండాలని అనుకుంటారు. సామాన్య, మధ్యతరగతి వారైతే దాదాపు జీవితంలో ఒక్కసారే సొంతం చేసుకునే సొంతింటి విషయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వారికి అందుబాటు ధరలో, నచ్చిన ప్రాంతంలో ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలా లేక అప్పటికే నిర్మాణం పూర్తైన ఇంటిని కొనుక్కోవాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులకు ఏది అనుకూలం అన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న.
నచ్చిన ఇంటిని, వారికి కావాల్సిన దశలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. నిర్మాణ దశలో ఇంటిని కొంటే నచ్చిన ఫ్లోర్, ఇష్టమైన దిక్కుకు ఉండేలా ఎంచుకోవచ్చు. ధర కూడా కొంత మేర తక్కువగా ఉండొచ్చు. ఆరంభ దశలో అయితే తమకు కావాల్సిన రీతిలో మార్పులు చేసుకోవచ్చు.
నిర్మాణ సమయంలో ఇంటిని కొంటే.. అది పూర్తయ్యేనాటికి ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. అప్పుడా ఇంటి ధర సుమారు 20 నుంచి 30 శాతం వరకు పెరుగుతుంది. కాకపోతే నిర్మాణ దశలో ఇంటిని కొంటే.. బిల్డర్ గడువులోపు ఇంటిని పూర్తి చేస్తాడా లేదా అనే భయం కొంతవరకూ ఉంటుంది. నిర్మాణ సమయం నుంచే హౌజ్ లోన్ కోసం నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి వస్తుంది.
నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇంటిని కొన్న వెంటనే గృహ ప్రవేశం చేయవచ్చు. ఇందుకోసం ఏమాత్రం ఎదురుచూడాల్సిన పని లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నగృహాల ధరలే తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సిమెంట్, స్టీల్ వంటి ముడి సరకుల ధరల పెరుగుదల దృష్ట్యా.. కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువ ధరలు ఉండే అవకాశం ఉందట.
నిర్మాణం పూర్తయి గృహప్రవేశానికి సిద్దంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల ఒకేసారి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు ఇంటిని మన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకోవాలంటే అదనంగా ఖర్చు చేయాలి.