Categories: LATEST UPDATES

నాశనం చేసేవారికే సంరక్షణ బాధ్యతలా?

నీరు లేకపోతే మనిషి మనుగడే ఉండదు. అందుకే చిన్నవైనా.. పెద్దవైనా నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అయితే, ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మీనమేషాలు లెక్కపెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ కూల్చివేత వ్యర్థాలను హుస్సేన్ సాగర్ లో పడేస్తున్నారంటూ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ లో దాఖలైన వ్యాజ్యంలో కనీసం తన వాదనలు వినిపించుకోలోని నిస్సహాయ స్థితిలో ఆ శాఖ ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అసలు హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి నిల్వ స్థాయి (ఎఫ్ టీఎల్) పరిధిలోకి వస్తున్న 28 ఎకరాల్లో సచివాలయం నిర్మిస్తున్నందున.. అది అక్రమ నిర్మాణమంటూ మరో వాదనా తెరపైకి వచ్చింది. ఇది ఇలా ఉంచితే.. తెలంగాణ వాటర్ ల్యాండ్, ట్రీ యాక్ట్ (వాల్టా) అథార్టీలో భాగస్వామ్యం కలిగిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏయూడీ) తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలేదని పర్యావరణవేత్తలు అంటున్నారు.

రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పౌరులతో కూడిన వాల్టా అథార్టీ.. నీటి వనరులతోపాటు చెట్లు, గాలి, భూమి తదితరాలను సంరక్షించాలి. కానీ ఇది ఎక్కడా సక్రమంగా జరగడంలేదు. పైగా తాజాగా ఈ బాధ్యతను కొత్తగా బిల్డర్లపై పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమైన విషయం. రియల్ ఎస్టేట్ డెవలపర్లు చేపట్టే ప్రాజెక్టుకు 500 మీటర్ల దూరంలో ఉన్న చెరువులు, సరస్సుల రక్షణ బాధ్యతను వారే చూసుకోవాలంటూ ఇటీవల హెచ్ఎండీఏ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని చెరువులు, సరస్సులను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త విధానం అమల్లోకి తెచ్చానని చెబుతున్న ఇదే శాఖ.. సచివాలయ కూల్చివేత వ్యర్థాలను మాత్రం హుస్సేన్ సాగర్ లో పారవేస్తోందని తెలిసింది. పైగా, చెరువుల్ని మాయం చేసి వాటి మీద అక్రమంగా అంతస్తుల్ని కట్టే డెవలపర్లకు పురపాలక శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు కొమ్ము కాస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం.

నిజానికి నీటి వనరులను కలుషితం చేస్తున్న డెవలపర్లకు వాటిని సంరక్షించే బాధ్యత అప్పగించడం ఎంతమాత్రం సమంజసం కాదని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి, వాల్టా అధికారులు మాత్రమే నీటి వనరులను సంరక్షించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని స్పష్టంచేస్తున్నారు. నీటివనరులను నాశనం చేసిన రికార్డు కలిగిన డెవలపర్లకు వాటి సంరక్షణ బాధ్యత అప్పగించే అధికారం ఎంఏయూడీ శాఖకు లేదని తేల్చి చెబుతున్నారు.

This website uses cookies.