Categories: TOP STORIES

భూ వివాదాలకు పూర్తిగా చెక్‌

(రియ‌ల్ ఎస్టేట్ గురు, అమ‌రావతి)

భూ వ్యవహారాల్లో పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేయాలని వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు. వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భూములు విక్రయించిన వారు, కొనుగోలు చేసినవారూ ఎవ్వరూ కూడా మోసాలకు, అవకతవకలకు, ఇబ్బందులకు గురికాకుండా విధానాలు ఉండాలని స్ప‌ష్టం చేశారు. ఏదైనా భూమి రిజిస్ట్రేషన్‌ అయ్యే నాటికి సబ్‌డివిజన్, మ్యుటేషన్‌ లాంటి ప్రక్రియలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల వివాదాలు, సమస్యలు లేకుండా రికార్డుల్లో స్పష్టత ఉంటుందని తెలిపారు. భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి, లేదా వ్యవహారం చేసుకున్న వ్యక్తికి స్పష్టమైన సబ్‌ డివిజన్‌తో, రికార్డుల్లో మార్పులతో, సర్వ హక్కులతో ఆ భూమి దఖలు పడాలన్నది సీఎం ఆలోచ‌న. ఇది ఎలా చేయాలన్న దానిపై అధికారులు కూర్చొని ఒక పద్ధతిని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివాదాలు ఏమైనా ఉంటే.. వాటిని పరిష్కరించడంపై దృష్టిపెట్టాలని తెలిపారు. వివాదాలు కొనసాగుతూ ఉంటే.. అవి జీవితాంతం భూ యజమానులను, కొనుగోలు చేసిన వారిని వెంటాడుతాయని… అందుకే ఇప్పుడున్న విధానాలను ప్రక్షాళన చేసి ప్రజలకు మంచి విధానాలు అందుబాటులోకి తీసుకురావాల‌ని సీఎం ఆదేశించారు.

భూ రికార్డుల్లో సంస్కరణలు తీసుకురావాలని.. రాజకీయాలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ వ్యవస్థ ఉండాలని సీఎం అన్నారు. రికార్డుల క్రమబద్ధీకరణలో పారదర్శకతకు పెద్దపీట వేసేలా చిరకాలం నిలిచిపోయేలా విధానాలు ఉండాలని.. ఒకరంటే ఇష్టం లేదని రికార్డుల్లో పేర్లు తొలగించడం, మరొకరు ఇష్టం ఉన్నారని వారి పేర్లను చేర్చడంలాంటి వాటికి ఇకపై చోటు ఉండకూడదన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా… అనుసరిస్తున్న విధానాలు శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని.. గిఫ్ట్‌లు, వారసుల మధ్య పంపకాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రోత్సహించాలని.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను బలోపేతం చేయడానికి, రికార్డులు సమర్థవంతంగా నిర్వహించడానికి, గిఫ్టు రూపేణా వచ్చిన భూమికి న్యాయపరంగా అన్ని హక్కులు దఖలు పడడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం వివ‌రించారు. దీనికి సంబంధించి విధానాలను రూపొందించాలని ఆదేశించారు.
సాదాబైనామాలకు సంబంధించి కూడా పత్రాలను క్రమబద్ధీకరించేందుకు తగిన విధానాలు తీసుకురావాలని తెలిపారు. దీనివల్ల రికార్డులు ప్రక్షాళన చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వీటి కోసం విధించే రుసుములు నామమాత్రంగా ఉండాలని.. దీనిపై అధికారులు ఒక కార్యాచరణ పూర్తిచేయాలన్నారు. ఎన్నాళ్లు గానో అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూములు, భూ వివాదాలను పరిష్కరించాలని.. లేకపోతే ఈ వివాదాలన్నీ కూడా తరతరాలుగా ప్రజలను వేధిస్తాయని సీఎం తెలిపారు. భూ వివాదాలు, అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు పరిష్కారాలు చూపించడానికి గ్రామ సచివాలయాల స్థాయిలో ఒక యంత్రాంగం ఉండాలన్నారు. దీనికోసం ఒక ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. నిర్దిష్ట కాల పరిమితితో వివాదాలు పరిష్కారం కావాలని.. వివాదం పరిష్కారం కావడమే కాదు, పరిష్కారమైన వివాదాల వివరాలు రికార్డుల్లో నమోదు కావాలన్నారు. లంచాలకు ఎక్కడా ఆస్కారం లేకుండా ఉండాలని రికార్డులు తారుమారు చేయలేని విధంగా విధానాలు ఉండాలని తెలిపారు.

This website uses cookies.