ఆఫీస్ లీజింగ్ లో భాగ్యనగరం దూసుకెళ్తోంది. ఈ ఏడాది జనవరి-జూన్ లో హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 4.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఇది 3.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇక సరఫరా సైతం అదే స్థాయిలో ఉంది. జనవరి-జూన్ లో హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ సరఫరా 4.6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. త్రైమాసికాలవారీగా చూస్తే.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2.3 మిలియన్ చదరపు అడుగులు కాగా.. సరఫరా 2.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. లైఫ్ సైన్సెస్ 27 శాతం, రీసెర్చ్, కన్సల్టింగ్, అనలిటిక్స్ 27 శతం, టెక్నాలజీ సంస్థలు 17 శాతం మేర లీజింగ్ లో వాటా కలిగి ఉన్నాయని సీబీఆర్ఈ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఏప్రిల్-జూన్ లో ఆఫీస్ స్పేస్ టేకప్ అనేది చిన్న పరిమాణాల (50వేల చదరపు అడుగులు కంటే తక్కువ) లావాదేవీల ద్వారానే ఎక్కవగా నడిచాయి. పాన్ ఇండియా ప్రాతిపదికన స్థూల ఆఫీస్ లీజింగ్ 32.8 మిలియన్ చదరపు అడుగులకు చేరడంతో ఆఫీస్ లీజింగ్ చాలా బలోపేతమైంది. మొత్తమ్మీద జనవరి-జూన్ కాలంలో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 14 శాతం మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో పెరుగుదల నమోదైంది. ఇదే సమయంలో సరఫరా 22.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
నగరాలవారీగా చూస్తే జనవరి –జూన్ కాలంలో మొత్తం లీజింగ్ లో 25 శాతంతో బెంగళూరు తొలి స్థానంలో ఉంది. ఢిల్లీ 16 శాతం, చెన్నై 14 శాతం, పుణె, హైదరాబాద్ లు 13 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఇక సరఫరా విషయానికి వస్తే బెంగళూరు, హైదరాబాద్, ముంబై కలిసి 69 శాతం వాటా కలిగి ఉండటం విశేషం. మొత్తం ఆఫీస్ లీజింగ్ లో 28 శాతం వాటాతో టెక్నాలజీ కంపెనీలో ముందున్నాయి. ప్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు 16 శాతం, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 15 శాతం, ఇంజనీరింగ్, తయారీ సంస్థలు 9 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలిటిక్స్ సంస్థ 8 శాతం వాటాతో ఉన్నాయి.
త్రైమాసిక ప్రాతిపదికన ఏప్రిల్-జూన్ లో ఆఫీస్ లీజింగ్ 18 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 27 శాతం అధికం. ఈ త్రైమాసికంలో బెంగళూరు, పుణె, చెన్నై కలిసి 57 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2024 మొదటి అర్ధభాగంలో లైఫ్ సైన్సెస్, టెక్, రీసెర్చ్ సంస్థలు ఆఫీస్ స్పేస్ ను అధికంగా టేకప్ చేసినట్టు సీబీఆర్ఈ చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మ్యాగజీన్ పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, స్థిరమైన ప్రభుత్వంతో మన దేశంలో ఆఫీస్ రంగం అప్రతిహతంగా దూసుకెళ్తోందని వ్యాఖ్యానించారు.
మరోవైపు దేశంలో ఆఫీస్ డిమాండ్ ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా వెల్లడించింది. 2024 జనవరి-జూన్ మధ్య హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, పుణే నగరాల్లో 33.54 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజింగ్ నమోదైందని తెలిపింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లీజింగ్ 29 శాతం పెరిగింది. ఇప్పటి వరకు అత్యధికంగా 2019 జనవరి-జూన్ మధ్య 30.71 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజింగ్ నమోదైంది. 2024లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏడు ప్రధాన నగరాల్లో స్థూల లీజింగ్ 65-70 మిలియన్ చదరపు అడుగులు నమోదు చేసి సరికొత్త మైలురాయిని చేరుకునే అవకాశం ఉందని జేఎల్‌ఎల్ ఇండియా అంచనా వేస్తోంది.
This website uses cookies.