Categories: INDUSTRY ISSUES

అమ్మకాల్లేవని డెవలపర్లు.. పెరిగాయన్న అనరాక్

    • ఏమిటీ వైరుధ్యమైన ప్రకటనలు
    • ఇందుకే కొనుగోలుదారులు వెనకడుగు
    • అమ్మకాల్లో హైదరాబాద్ టాప్ అని అనరాక్

అమ్మకాల్లేవని అంటున్ననిర్మాణ సంఘాలు

ఒకవైపు క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణ, ట్రెడా, టీబీఎఫ్ వంటి నిర్మాణ సంఘాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు మందగించాయని ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రంలో వెల్లడించాయి. మార్కెట్ విలువల పెంపుదల, కొవిడ్ థర్డ్ వేవ్, యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్ వంటి అంశాల కారణంగా.. నగర నిర్మాణ రంగం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోందని తెలిపారు. మార్కెట్ విలువ పెంపుదల నిర్ణయం సందర్భంగా ఇటీవల తెలంగాణ నిర్మాణ సంఘాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ కి ఇచ్చిన నివేదికలో వెల్లడించాయి.

టీబీఎఫ్ అయితే ఏకంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి రియల్ రంగం నిలబడాలంటే మార్కెట్ విలువల పెంపుదల వాయిదా వేయాలని లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ఇందుకు భిన్నంగా 2021లో అమ్మకాలు పెరిగాయని అనరాక్ నివేదికలో వెల్లడించింది. ఇంతకీ నిర్మాణ సంఘాలు చెబుతున్న విషయం కరెక్టా? లేక అనరాక్ సంస్థ నిజం చెబుతుందా?

దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే ప్రాజెక్టుల ప్రారంభాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని అనరాక్ చెబుతోంది. అమ్మకాల్లో తొలి స్థానంలో నిలిచిందట. ఇళ్ల అమ్మకాల్లో గణనీయమైన వేగం పెరగడంతో దానికి తగట్టుగానే కొత్త ప్రాజెక్టులు శరవేగంగా లాంచ్ అయ్యాయట. ముఖ్యంగా 2021 నాలుగో త్రైమాసికంలో ఈ వేగం ఎక్కువగా కనిపించిందట. ఆరు నెలల క్రితం పెంచిన మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల రియల్ రంగంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని నిర్మాణ సంఘాలు చెబుతున్నాయి. మరి, ఈ రెండింట్లో ఏది నిజమనే విషయాన్ని ఎవరు చెబుతారు?

సీఎం కూడా చెప్పారు..

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలూ ప్రభావితమైనట్టుగానే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒడుదొడుకులకు లోనైంది. అయితే, తిరిగి అంతే వేగంతో గాడిన పడింది. ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరాస్థి రంగం ఉవ్వెత్తున ఎగసిందని అనరాక్ తాజా నివేదిక చెబుతోంది. మరి, దీని ప్రకారం భాగ్యనగరంలో అమ్మకాలు పెరిగినట్లే కదా? పరిస్థితి ఇంత సానుకూలంగా ఉన్నప్పుడు ప్రభుత్వం మార్కెట్ విలువల్ని రెండోసారి పెంచడంలో తప్పేంటి? స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో.. రాష్ట్రంలో వ్యవసాయ భూముల ధరలు గణనీయంగా పెరిగాయని..కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి కోటీ రూపాయలు పలుకుతోందని.. ఒక్కో విల్లా గరిష్ఠంగా రూ.20 కోట్లకు అమ్ముడవుతుందని వివరించారు.

కానీ, నిర్మాణ సంఘాలేమో మార్కెట్ పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదని అంటున్నాయి. మరి, ఎవరి మాటల్ని నమ్మాలో తెలియక కొనుగోలుదారులు సొంతింటి కలను నెరవేర్చుకోవడాన్ని కొంతకాలం వాయిదా వేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికైనా అనరాక్ వంటి సంస్థలు వాస్తవిక నివేదికల్ని అందిస్తేనే కొనుగోలుదారుల్ని సొంతింటి ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

దూకుడు పెరిగేనా?

2022లో హైదరాబాద్ రియల్ దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందని అనరాక్ అంచనా వేసింది. ఈ నగరంలో ఉన్న సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటు చక్కని మౌలిక వసతులు, అందుబాటు ధరలు వంటి అంశాల వల్లే రియల్ రంగం ప్రగతిపథంలో దూసుకు వెళ్తోందని పేర్కొంది. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతిలో రియల్ రంగం తిరోగమనంలో ఉండటం కూడా హైదరాబాద్ కు కలసి వచ్చిందని విశ్లేషించింది. గత నాలుగైదు త్రైమాసికాలుగా అమరావతి రియల్ రంగం స్తబ్దుగా ఉండటంతో ఇన్వెస్టర్లు, డెవలపర్లు హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారని వివరించింది.

ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలతో పాటు ఐటీ హబ్ లు, ఇండస్ట్రీలు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రతిపాదనలు కలిసి హైదరాబాద్ ను రియల్ రంగంలో మకుటం లేని మహారాజులా నిలబెడుతున్నాయని తెలిపింది. అటు రెసిడెన్షియల్ సెగ్మెంటులోనే కాకుండా కమర్షియల్ సెగ్మెంట్ లో కూడా రియల్ రంగం దూసుకెళ్తోందని పేర్కొంది. రానున్న త్రైమాసికాల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుందని స్పష్టం చేసింది.

This website uses cookies.