దాదాపు ఏడేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములకు సంబంధించిన మార్కెట్ విలువల్ని సవరించేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన సూచనల మేరకు రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువలకు ( Land Value ) సంబంధించిన కసరత్తులో వేగం పెంచింది. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లోపు పూర్తి వివరాల్ని ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిసింది. గత నెలలో సుమారు రెండు లక్షల రిజిస్ట్రేషన్లు జరగడంతో రియల్ రంగానికి గల గిరాకీని ఉన్నతాధికారులు పక్కా అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ విలువలు ఏడు సార్లు పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 11 శాతం, తమిళనాడులో ఏడున్నర శాతం, మహారాష్ట్రలో ఏడు శాతం వసూలు చేస్తున్నారు. వాటితో పోల్చితే మన వద్ద చాలా తక్కువగా ఉంది. అంతకంటే, ముఖ్యంగా భూముల విలువలు మరీ తక్కువగా ఉన్నాయి. దీంతో చాలామంది గృహరుణం కోసం మార్కెట్ విలువను ఎక్కువగా చూపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోంది. పైగా, రియల్ సంస్థలూ తమ ఫ్లాట్ ధరను నిర్ణయించేటప్పుడు మార్కెట్ విలువనే పరిగణనలోకి తీసుకుంటాయనే విషయం తెలిసిందే.
ప్రస్తుతం గచ్చిబౌలిలో పలు నిర్మాణ సంస్థలు చదరపు అడుక్కీ రూ.పది వేలకు అటుఇటుగా విక్రయిస్తున్నాయి. కొండాపూర్‌లో కొన్ని సంస్థలు చదరపు అడుక్కీ రూ.8 నుంచి 10 వేల మధ్యలో అమ్ముతున్నాయి. ఇక, షేక్‌పేట్ వంటి ప్రాంతంలో ఓ బడా నిర్మాణ సంస్థ చదరపు అడుక్కీ రూ.14 వేలు చొప్పున ఫ్లాట్లను విక్రయిస్తోంది. మార్కెట్లో పలు సంస్థలు అమ్ముతున్న ఫ్లాట్ల ధరల్ని పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువలపై కసరత్తు చేస్తోందని సమాచారం. మరి, అంతా సవ్యంగా సాగితే, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తే.. ఆగస్టు నుంచి భూముల మార్కెట్ విలువలు పెరిగే ఆస్కారముందని చెప్పొచ్చు.
భూముల మార్కెట్ విలువల పెంపుదలపై నిర్మాణ సంస్థల వాదన మరోలా ఉంది. ప్రస్తుత కరోనా సమస్యలో మార్కెట్ చుట్టుముట్టుకుంది కాబట్టి, ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తే మంచిదని పలువురు డెవలపర్లు అంటున్నారు. గత నెలలో భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగాయే తప్ప ఫ్లాట్లకు సంబంధించి ఎక్కువగా లేవని చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేస్తే ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. మరి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
This website uses cookies.