కొత్త ప్రభుత్వ తోడ్పాటుతో
డిమాండ్ ఉంటుందని అంచనా
హైదరాబాద్ రియల్ రంగ భవితవ్యానికి ఎలాంటి ఢోకా లేదని, ప్రభుత్వం మరినా డిమాండ్ తగ్గే అవకాశం లేదని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న కీలక నిర్ణయాల ఫలితంగా భాగ్యనగర స్థిరాస్తి రంగానికి ఢోకా ఉండదని పేర్కొంటున్నారు.
వాస్తవానికి గత బీఆర్ఎస్ సర్కారు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా రియల్ రంగం అభివృద్ధికి కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఎకరం భూమి రూ.వంద కోట్లకు పైగా ధర పలికింది. తద్వారా హైదరాబాద్ పరపతి మరింత పెరిగిందని బీఆర్ఎస్ పేర్కొనగా.. దీనివల్ల భూముల ధరలు ఆకాశాన్నంటి సామాన్యలు సొంతింటి కల మరింత దూరమైందనే విమర్శలూ వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగా.. రియల్ రంగానికి, ఐటీకి పూర్తి సహాయ సహకారాలు అందించిన బీఆర్ఎస్ వైపు హైదరాబాద్ వాసులు మొగ్గు చూపించారు. అందుకే ఆ పార్టీకి వచ్చిన 38 సీట్లలో ఎక్కువభాగం హైదరాబాద్ లోనే ఉన్నాయి.
మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంతరెడ్డి సైతం హైదరాబాద్ అభివృద్ధికి తమ వద్ద మెగా మాస్టర్ ప్లాన్ ఉందని పేర్కొన్నారు. రియల్ రంగం నుంచి వచ్చిన తనకు ఈ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరాలతో పోటీపడేలా అభివృద్ధి చేయాలనే కృత నిశ్చయంతో ఉంది. ఇందుకోసం 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురానున్నట్టు ప్రకటించింది. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు మున్సిపల్ కొర్పారేషన్లు, 30 మున్సిపాలిటీలను కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్ తీసుకురావాలనే యోచనతో ఉంది. అలాగే రీజనల్ రింగు రోడ్డు వద్ద కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టాలని యోచిస్తోంది. మురికికూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
లండన్ థేమ్స్ నదీతీరంలా దీనిని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. లండన్ వెళ్లి థేమ్స్ నదీతీరం, అక్కడి పర్యాటకం ఎలా అభివృద్ధి చెందిందో స్వయంగా పరిశీలించి వచ్చారు. మూసీని సుందరీకరిస్తే.. హైదరాబాద్ అది తలమానికం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో మూసీకి ఇరువైపులా ఇళ్లకు మరింత డిమాండ్ పెరుగుతుంది. ఇవన్నీ అమల్లోకి వస్తే.. హైదరాబాద్ మరింత అభివృద్దిపథంలోకి దూసుకెళ్లడం ఖాయమని.. తద్వారా రియల్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
This website uses cookies.