Categories: LATEST UPDATES

న‌మ్మారో.. నట్టేట్లోకే

పెరుగుతున్న రియల్ మోసాలు
ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో బురిడీ
గ్రేటర్ లోనే రూ.10 వేల కోట్లకు పైగా మోసాలు

రియల్ రంగంలో పారదర్శకత కోసం రెరా వంటి చట్టాలతో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా మోసాలు మాత్రం ఆగడంలేదు. తక్కువ ధరకే ఇళ్లిస్తామంటూ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సామాన్యుల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. కొనుగోలుదారులకు ప్రీలాంచ్ ఆఫర్ల జోలికి వెళ్లొద్దని చెబుతున్నా.. తక్కువకు వస్తుందనే ఆశతో వెళ్లి వారి బుట్టలో పడుతున్నారు. రోడ్లు, విద్యుత్‌ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేని ప్రాంతాల్లో రియల్‌ ప్రాజెక్టుల పేరిట ప్రచారం చేస్తున్నారు.

భూమి యజమానులతో ఒప్పందం చేసుకొని, ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, ప్రీలాంచ్‌లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ డబ్బే భూమి యజమానికి కట్టి, ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా, భూ యజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్ట్‌ ఆగిపోయి ప్రీలాంచ్‌లో బుక్‌ చేసుకున్నవారు రోడ్డున పడుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ప్రీలాంచ్‌ ప్రాజెక్టులు చేపట్టి పలువురిని కొల్లగొట్టాయి. నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్‌బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్‌పేట, ఆదిబట్ల ఇలా హైదరాబాద్‌ నలువైపులా ఈ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు కనీసం వంద వరకు ఉంటాయని, నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్‌ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సంబంధిత బిల్డర్, కంపెనీ పూర్వాపరాలు పరిశీలించాలని ఎంతగా చెబుతున్నా పలువురు పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా రెరా అనుమతి లేని ప్రాజెక్టుల జోలికి వెళ్లకపోవడం చాలా ఉత్తమం.

This website uses cookies.