poulomi avante poulomi avante

హైదరాబాద్‌లో.. ఆకాశ‌హ‌ర్మ్యాలు అవ‌స‌ర‌మా?

Why Hyderabad need Skyscrapers when there are no geographical barriers?

  • నాలుగు వైపులా విస్త‌ర‌ణ‌కు అవ‌కాశం
  • అయినా, ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌ట్టేదెందుకు..
  • సెట్‌బ్యాక్స్ తొల‌గించ‌డమే త‌ప్పు అయ్యిందా?
  • స్థ‌ల య‌జ‌మానులు, బిల్డ‌ర్ల అత్యాశే కార‌ణ‌మా..
  • అగ్నిప్ర‌మాదాల్ని అదుపు చేసే స‌త్తా ఉందా?
  • అంతెత్తుకు ఫైర్ ఇంజిన్లు చేరుకుంటాయా?
  • డెవ‌ల‌ప‌ర్ల గ‌త చ‌రిత్ర‌ను బ‌య్య‌ర్లు చూడాలి
  • నిర్మాణం పూర్తి చేసే స‌త్తాను తెలుసుకోవాలి

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి భౌగోళికప‌ర‌మైన‌ అడ్డంకులేమీ లేవు. న‌గ‌రం నాలుగు వైపులా విస్త‌రించ‌డానికి పూర్తి అవ‌కాశాలున్నాయి. అదే, చెన్నై, ముంబై వంటి న‌గ‌రాల‌కు స‌ముద్రం అడ్డు ఉండ‌గా.. ఢిల్లీ విస్త‌రించ‌డానికి ఆస్కారం లేదు. కానీ, మ‌న న‌గ‌రం ఇందుకు పూర్తిగా భిన్నం. సిటీ ఎటైనా విస్త‌రించొచ్చు. ఎక్క‌డికెళ్లినా అపార్టుమెంట్ల‌ను క‌ట్టొచ్చు. అయినా, ఇదేమీ ప‌ట్టించుకోకుండా.. కొందరు డెవ‌ల‌ప‌ర్లు కేవ‌లం ప‌శ్చిమ హైద‌రాబాద్ మీదే ప‌డ్డారు. న‌ల‌భై, యాభై అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌డుతున్నారు త‌ప్ప ఇత‌ర ప్రాంతాల‌కెళ్లేందుకు సాహ‌సించ‌ట్లేదు. వీరంతా మార్కెట్ ప‌రిస్థితుల్ని ప‌ట్టించుకోకుండా.. స్కై స్క్రేప‌ర్ల‌నే ఎందుకు క‌డుతున్నారు? వాటిలో కొన‌డం వ‌ల్ల కొనుగోలుదారుల‌కు క‌లిగే లాభ‌న‌ష్టాలేమిటి?

హైద‌రాబాద్ న‌గ‌రానికి నాలుగు వైపులా విస్త‌ర‌ణ‌కు ఆస్కార‌ముంది. ప‌టాన్ చెరు, శామీర్‌పేట్‌.. శంషాబాద్‌, షాద్ న‌గ‌ర్‌.. రామోజీ ఫిలింసిటీ, ఘ‌ట్ కేస‌ర్‌.. చేవేళ్ల‌, శంక‌ర్ ప‌ల్లి.. ఇలా ఎటు నుంచి అయినా హైద‌రాబాద్‌కు చేరుకోవ‌డానికి మ‌హా అయితే గంట ప‌డుతుందేమో! మెట్రో, ఎంఎంటీఎస్‌, స‌బ‌ర్బ‌న్ వంటి రైళ్లు ఆరంభ‌మైతే ఈ ప్ర‌యాణ స‌మ‌యం మ‌రింత త‌గ్గొచ్చు. ఇలాంటి వాస్త‌వాల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు ఆకాశ‌హ‌ర్మ్యాల్ని నిర్మిస్తున్నారు. మార్కెట్లో స్థ‌లం కొర‌త లేన‌ప్పుడు.. ఇలా కొన్ని ప్రాంతాల‌కే బిల్డ‌ర్లు ఎందుకు ప‌రిమితం అవుతున్నారు? న‌ల‌భై, యాభై అంత‌స్తుల్ని ఎందుకు క‌డుతున్నారు? భాగ్య‌న‌గ‌రంలో వీటిని క‌ట్ట‌డం అవ‌స‌ర‌మా? అని సామాన్య కొనుగోలుదారులు ప్ర‌శ్నిస్తున్నారు. మియాపూర్ వంటి ప్రాంతంలో కొంద‌రు స్థ‌ల‌య‌జ‌మానులు యాభై అంత‌స్తులు క‌ట్టేందుకు పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ట్రాఫిక్ ర‌ద్దీతో న‌ర‌కం అనుభ‌విస్తున్న కార‌ణంగా.. ఇక నుంచి మియాపూర్‌, బాచుప‌ల్లి, ప్ర‌గ‌తిన‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తినివ్వ‌కూడ‌ద‌ని ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇదే ప్ర‌ధాన కార‌ణం..

తెలంగాణ రాష్ట్రంలో అప‌రిమిత ఎఫ్ఎస్ఐ విధానం అందుబాటులో ఉంది. అంటే, ప్లాటు విస్తీర్ణం.. ముందున్న రోడ్డు సైజును బ‌ట్టి.. ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని చేప‌ట్టేందుకు కేవ‌లం తెలంగాణ‌లో మాత్ర‌మే ఆస్కార‌ముంది. 2006 నుంచి ఈ విధానం అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ.. కేవలం గ‌త రెండు, మూడేళ్ల నుంచి ఆకాశ‌హ‌ర్మ్యాల సంఖ్య పెరుగుతోంది. ఎందుకో తెలుసా? గ‌తంలో ఎంత ఎత్తుకు వెళితే అంత సెట్ బ్యాక్‌ల‌ను వ‌దిలేవారు. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నిబంధ‌న‌ను ఎత్తివేసింది. దీంతో డెవ‌ల‌ప‌ర్లు అధిక బిల్ట‌ప్ ఏరియా అందుబాటులోకి వ‌చ్చేసింది. ఈ విష‌యాన్ని తెలుసుకున్నాక‌.. స్థ‌ల‌య‌జ‌మానులు ఎక్కువ విస్తీర్ణం క‌ట్టే బిల్డ‌ర్ల‌కే డెవ‌ల‌ప్‌మెంట్ కోసం స్థ‌లం ఇవ్వ‌డం ఆరంభించారు. దీంతో, డెవ‌ల‌ప‌ర్ల మ‌ధ్య పోటీత‌త్వం పెరిగి.. ఆకాశ‌హ‌ర్మాల్ని కట్టేందుకు పోటీ ప‌డుతున్నారు. అస‌లు వీటిలో కొన‌డం వ‌ల్ల సానుకూల‌త‌లేమిటి? ప్ర‌తికూల‌తలేమిటి? కొనుగోలుదారులు ఏయే అంశాల్ని గ‌మ‌నించి ఫ్లాట్ల‌ను ఎంచుకోవాలి?

సానుకూల‌త‌లివే!

ఆకాశ‌హ‌ర్మ్యాలు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల న‌గ‌రం కాస్త కొత్త‌గా క‌నిపిస్తుంది. వీటి వ‌ల్ల వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. న‌గ‌రానికి ప‌ర్యాటకుల ర‌ద్దీ అధిక‌మ‌వుతుంది.

  •  ఆకాశ‌హ‌ర్మ్యాలు ఎక్కువుంటే స్థ‌ల వినియోగం మెరుగ్గా జ‌రుగుతుంది. ఇవి స్థ‌లాన్ని ఆదా చేస్తాయి.
  •  త‌క్కువ స్థ‌లంలో ఎక్కువ కుటుంబాలు నివ‌సించ‌వ‌చ్చు. వాణిజ్య భ‌వ‌నాల్లో.. త‌క్కువ విస్తీర్ణంలో అధిక కంపెనీలు ఏర్పాటవుతాయి.
  •  ఆకాశ‌హ‌ర్మ్యాల్లో గాలీ, వెలుతురు ధారాళంగా ప్ర‌స‌రిస్తుంది. హ‌రిత భ‌వ‌నాల్లో నివ‌సించాల‌ని భావించేవారికి ఇవి చ‌క్క‌టి ఆప్ష‌న్ అని చెప్పొచ్చు.
  •  ఎత్తైన భవనాల నిర్మాణానికి భవనాన్ని రూపొందించడానికి అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, సాంకేతిక సిబ్బంది అవసరం. దీనికి అధిక స్థాయిలో ఖర్చు అవుతుంది.
  •  ఆకాశహర్మ్యాల్ని తక్కువ స్థలంలో భూమి మీద నిర్మిస్తారు. ఆయా మట్టి నాణ్యతను పూర్తి స్థాయిలో పరిశీలించాలి. మట్టి విఫలమైతే భవనం కూలిపోవచ్చు. కాబట్టి, స్థానిక సంస్థల అధికారులు మట్టి నాణ్యతను నిశితంగా పరిశీలించాకే ఎత్తయిన భవనాలకు అనుమతినివ్వాలి.
  •  ఆకాశహర్మ్యాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల నగరం చూడచక్కగా కనిపిస్తుంది. ఆకాశహర్మ్యాలతో నగర అందం ద్విగుణీకృతం అవుతుంది.
  •  ఎత్త‌యిన నిర్మాణాల్లో నివ‌సించేవారికి ట్రాఫిక్ ర‌ణ‌గొణ‌ధ్వ‌నులు లేకుండా ప్ర‌శాంతంగా నివ‌సిస్తారు.

ప్ర‌తికూల‌త‌లివే..

భ‌ద్ర‌త గురించి ఎక్కువ‌గా చింతించాల్సి ఉంటుంది. ఈ భారీ నిర్మాణాలు ఎంత పెద్ద‌గా ఉన్న‌ప్ప‌టికీ, కొన్ని ప్ర‌కృతి వైప‌రీత్యాల వ‌ల్ల దెబ్బ తినే అవ‌కాశం లేక‌పోలేద‌ని నిపుణులు అంటున్నారు. ఆకాశ‌హ‌ర్మ్యానికి భారీ స్థాయిలో పునాది ఉండాలి కాబ‌ట్టి, ప్ర‌కృతి వైప‌రీత్యం సంభ‌విస్తే పునాది దెబ్బ‌తినే ప్ర‌మాదం లేక‌పోలేదు. కాబ‌ట్టి, వీటిని కొనేముందు వాటి నాణ్య‌త గురించి బిల్డ‌ర్‌ని అడిగి తెలుసుకోవాలి.

  • ఆకాశ‌హర్మ్యాల్ని నిర్మించేందుకు ఖ‌ర్చు ఎక్కువ అవుతుంది. ఒక‌సారి నిర్మాణం ఆరంభ‌మైతే.. వాటిని పూర్తి చేయ‌డం అంత సులువేం కాదు. బిల్డ‌ర్ ఆర్థిక స్థోమ‌త గురించి ప‌క్కాగా అంచ‌నా వేశాకే ఇందులో కొనాలి.
  • త‌క్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది నివ‌సించ‌డం వ‌ల్ల రద్దీగా క‌నిపిస్తుంది. ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్లి రావాలంటే లిఫ్టుల కోసం వేచి చూడాలి.
  • త‌క్కువ స్థ‌లంలో అధిక శాతం మంది ప్ర‌జ‌లు నివ‌సిస్తారు కాబ‌ట్టి.. విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌక‌ర్యాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆయా ప్రాంతంలో ర‌హ‌దారుల్ని స్థానిక సంస్థ‌లు అభివృద్ధి చేయ‌క‌పోతే ఇక అంతే సంగ‌తులు.
  • పొర‌పాటున అగ్ని ప్ర‌మాదం సంభ‌విస్తే, న‌ల‌భై నుంచి యాభై అంత‌స్తుల‌కు వెళ్ల‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే వాహ‌నాలు.. అంత ఎత్తుకు చేరుకునే అగ్నినిరోధ‌క సామ‌గ్రి మ‌న వ‌ద్ద ఉందా? ప్ర‌ధానంగా.. తూర్పు, ప‌శ్చిమ హైద‌రాబాద్‌లో వీటి సంఖ్య‌ను పెంచాల్సిన అవ‌స‌రముంది.
  • అగ్నిప్ర‌మాదం సంభ‌విస్తే.. అంతంత ఎత్తుకు నీళ్లు వెళ్ల‌గ‌లుగుతాయా? న‌ల‌భై, యాభై అంత‌స్తుల ఎత్తుకు నీళ్ల‌ను పంపింగ్ చేసే ప‌రిక‌రాలు మ‌న అగ్నినిరోధ‌క శాఖ వ‌ద్ద ఉన్నాయా? ఒక‌వేళ లేక‌పోతే, వీటికి స‌మ‌కూర్చుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది.
  • పెంపుడు జంతువులకు సంబంధించి అపార్టుమెంట్ ఎంత స్నేహపూర్వక విధానాలను అవలంబించినప్పటికీ, పై అంతస్తులో నివసించే విషయంలో ఇతర సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పొరుగువారు మీతో ఎలివేటర్‌ను పంచుకోవడానికి భయపడవచ్చు. అందువల్ల, మీరు మీ కుక్కను నడకకు తీసుకెళ్లే ప్రతిసారీ మీరు మెట్లను ఉపయోగించాల్సి రావొచ్చు.
  • బయటి గోడలకు రంగులు వేయడం, ఎయిర్ కండీషనర్‌లను బిగించ‌డం, లీక్ అవుతున్న గ్యాస్
    పైప్ లైనుకు మ‌ర‌మ్మ‌తులు చేయ‌డంలో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అన్ని రకాల సాధారణ గృహ నిర్వహణ మరియు అప్-గ్రేడేషన్ పనులు ఎత్తైన భవనంలో కష్టం కావొచ్చు.
  • పై అంత‌స్తులో నివ‌సించేవారి ఫ్లాట్‌లోకి లీకేజీలు ఏర్ప‌డితే.. వాటికి మ‌ర‌మ్మ‌తులు చేయించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ముఖ్యంగా బ‌య‌టి గోడ‌ల్లో నుంచి నీరు ఇంట్లోకి వ‌స్తుంటే.. స‌మ‌స్య తీవ్రంగా ఉంటుంది. కాబ‌ట్టి, బిల్డ‌ర్లు ఎక్స్‌ట‌ర్న‌ల్ గోడ‌ల్ని ఎంతో జాగ్ర‌త్త‌గా నిర్మించాల్సి ఉంటుంది.
  • పార్కింగ్ కోసం ఇబ్బంది ప‌డ‌క త‌ప్ప‌దు. డిజైనింగ్ స‌మ‌యంలో.. అంత‌ర్గ‌తంగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విష‌యంలో ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేసినా.. అందులో నివ‌సించేవారు జీవితాంతం ఇబ్బందులు ప‌డాల్సిందే.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles