కూల్చివేతలకు కొన్నాళ్ల విరామం
ప్రజల్లో భయాందోళనల నేపథ్యంలో సర్కారు నిర్ణయం
అక్రమ నిర్మాణాల కూల్చివేతతో రియల్ రంగంలో దడ పుట్టించిన హైడ్రా బుల్డోజర్ కు బ్రేక్ పడింది. ఈ కూల్చివేతల పట్ల నిరసనలు, ఇతరత్రా ఆందోళన నేపథ్యంలో హైడ్రాకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు నెలలపాటు కూల్చివేతలు చేపట్టొద్దని హైడ్రాకు సూచించింది. ఈలోగా హైడ్రా నిర్మాణంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. హైడ్రా ఏర్పడక ముందే జీహెచ్‌ఎంసీ ఆధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్ మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం)’ కూల్చివేతలు ప్రారంభించింది. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు.
మొత్తం 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు. అయితే, హైడ్రా విషయంలో తొలుత సానుకూల స్పందన వ్యక్తమైనా.. తర్వాత రానురానూ ప్రతికూలత పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రాపర్టీల క్రయవిక్రయాలను పడిపోయాయి. మరోవైపు అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైడ్రాపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతూ వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం.
This website uses cookies.