(ఆర్ఈజీ న్యూస్, హైదరాబాద్): ప్రభుత్వమే వేలం పాటల్ని నిర్వహిస్తూ.. భూముల రేట్లను పెంచుతుంటే.. ప్రైవేటు బిల్డర్లు పెంచకుండా ఉంటారా చెప్పండి? వీళ్లెందుకు పెంచుతున్నారంటే.. ల్యాండ్ లార్డ్స్ గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారు.. అందుకే తప్పడం లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఏదీఏమైనా, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి హైదరాబాద్‌లో సొంతిల్లు దూరమైంది. భారమైంది. సరిగ్గా, ఇదే అవకాశాన్ని అక్రమార్కులు అందిపుచ్చుకున్నారు. తక్కువ ధరకే ఫ్లాటంటూ.. ముందే వంద శాతం కడితే.. ఎంచక్కా సొంతింట్లోకి అడుగుపెట్టొచ్చని మభ్యపెడుతున్నారు. రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులో ఫ్లాటుకు కోటి రూపాయలు అయితే, తమ వద్ద కొంటే రూ.50 లక్షలకే వస్తుందంటూ బుట్టలో వేసుకుంటున్నారు. అయితే, యూడీఎస్ పథకంలో ఫ్లాటు కొంటే కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందా? ఒకేసారి వంద శాతం సొమ్ము కట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
యూడీఎస్ | రెరా | |
3బీహెచ్కే ఫ్లాట్ ధర | రూ.50 లక్షలు | రూ. కోటి |
ఆరంభంలో కట్టే సొమ్ము | మొత్తం 50 లక్షలు | రూ.10 లక్షలు (10 శాతం) |
మధ్యలో ఏమైనా కట్టాలా? | ఏమీ లేదు | పురోగతిని బట్టి |
పూర్తయ్యేదెప్పుడు? | కచ్చితంగా చెప్పలేం | 3-4 ఏళ్లు |
నిర్మాణం ఆగిపోతుందా? | అవును | లేదు |
ఎలా? | లీగల్ సమస్యలు | అలాంటివేం ఉండవు |
అనుమతులొస్తాయా? | కచ్చితంగా చెప్పలేం | వచ్చాకే ఆరంభం |
ఇక్కడ కొనుగోలుదారులు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. యూడీఎస్ లో ఫ్లాటు కొన్నప్పుడు ఒకేసారి రూ.50 లక్షలు చెల్లిస్తారు. దానిపై నెలకు రూ. 2 శాతం చొప్పున వడ్డీ లెక్కిస్తే.. నెలకు రూ. లక్ష అవుతుంది. ఇలా 48 నెలల్ని పరిగణనలోకి తీసుకుంటే.. రూ.98 లక్షలు అవుతుంది. అంటే, ఇంచుమించు రెరాలో ఫ్లాటు కొన్నంతనే అవుతుంది. ఈ లాజిక్ చాలామందికి అర్థం కావడం లేదు. పైగా, యూడీఎస్ లో ఫ్లాటు కొన్నాక.. అందులో లీగల్ సమస్యలు తలెత్తితే అనుమతులు ఎట్టి పరిస్థితిలో రావు. దీని వల్ల మొదటికే మోసం వస్తుంది.
ఆయా భూమి ఉన్న ప్రాంతం ప్రకారం కన్జర్వేషన్ జోన్ లేదా ఇతర నిషేధిత జోన్లలో ఉంటే గనక స్థానిక సంస్థలు అనుమతిని మంజూరు చేయవు. ఆయా స్థలంపై న్యాయపరమైన వివాదాలుంటే, ఆ కేసు తేలడానికి ఎంత టైము పడుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి, అలాంటి వాటిలో కొంటే నష్టపోయేది కొనుగోలుదారులే. కాబట్టి, యూడీఎస్ లో ఫ్లాట్లు కొనేటప్పుడు ఇలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. లేకపోతే, మీ కష్టార్జితం కాస్త బూడిదలో పోసిన పన్నీరుగా మారే ప్రమాదముంది.
This website uses cookies.