అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్రూసేడర్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) స్థాపించిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నిర్ణయించింది. మన భూ గ్రహాన్ని పరిరక్షించుకునే మార్గాలను విస్తృతం చేసే ఉద్దేశంతో ఏటా ఏప్రిల్ 22న అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్’ థీమ్ తో ఎర్త్ డే జరుపుకోనున్నారు.
మనకు అతిపెద్ద ముప్పుగా పరిగణించిన వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు హరిత భవనాల దిశగా అందరినీ మళ్లించడంతోపాటు ప్రభుత్వాలు, డెవలపర్లు, బిల్డర్లు, ఆర్కిటెక్టులు, పౌరులను కార్మోన్ముఖుల్ని చేయడమే దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఐజీబీసీ గ్రీన్ క్రూసేడర్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని డెవలపర్లు, బిల్డర్లు, యజమానులు తమ ప్రాజెక్టులను తగిన ఐజీబీసీ రేటింగ్ సిస్టమ్స్ లలో నమోదు చేస్తారు. తద్వారా సుస్థిరమైన భూ గ్రహాన్ని నిర్మించే విషయంలో తమ వంతు పాత్ర పోషించనున్నారు. ఈ డ్రైవ్ లో పాల్గొన్నవారిని ఈనెల 22న హైటెక్ సిటీలోని సోహ్రాబ్జీ గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో జరిగే కార్యక్రమంలో సన్మానించనున్నారు. కాగా, రాబోయే తరాల కోసం సహజ వనరులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. 40 శాతం వరకు ఇంధనం తగ్గించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, నిర్వహణ ఖర్చులు తగ్గించడం వంటి చర్యల ద్వారా తమ ప్రాజెక్టులకు ఐజీబీసీ గ్రీన్ రేటింగ్ విధానం అనుసరించాలని ఆయన సూచించారు.
This website uses cookies.