తెలంగాణ రెరా అథారిటీ ఏర్పాటైన కొత్తలో డెవలపర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుందని ఆశించారు. ఈ రంగంలో జవాబుదారీతనం పెరుగుతుందని భావించారు. కానీ, కొన్ని నెలలకే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
రెరాను తప్పించుకోవాలనో.. పెరిగిన ఫ్లాట్ల ధరల వల్ల విసుగు చెందో తెలియదు కానీ.. కొందరు వ్యక్తులు కొనుగోలుదారుల్ని బుట్టలో వేసుకున్నారు. మాయమాటలు చెప్పి ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను విక్రయించారు. మార్కెట్ రేటు కంటే తక్కువ అంటూ ఊదరగొట్టారు. ఇంతకంటే గొప్ప అవకాశం లేదన్నారు. భవిష్యత్తులో రాకపోవచ్చన్నారు. దీంతో కొందరు కొనుగోలుదారులు ఊర్లో ఉన్న పొలమో ఇల్లో అమ్మేసి.. వ్యక్తిగత రుణం తీసుకుని మరీ.. ప్రీలాంచుల్లో ఫ్లాట్లను కొన్నారు. అంటే, కేవలం పేపరు మీదే ఫ్లాట్లను కొన్నారు. దీంతో, అవి ఎప్పుడు పూర్తవుతాయా అంటూ ఆశతో ఎదురు చూస్తున్నారు.
రెరా అనుమతి లేకుండా.. ఎకరాల స్థలాన్ని గుంటల్లో విక్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. ఫలితంగా, వందలాది ఎకరాల్లో స్థానిక సంస్థల అనుమతుల్లేకుండానే వెంచర్లు ఆరంభయ్యాయి. చూడటానికి ఇవి లేఅవుట్లుగానే కనిపిస్తాయి. కానీ, వీటికి ఫామ్ ల్యాండ్ అని ముద్దుగా పేరు పెట్టి అమ్మేస్తున్నారు. గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయకూడదనే నిబంధనను స్థానిక సబ్ రిజిస్ట్రార్లు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎవరు డబ్బులిస్తే వారికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలా వందలాది ఎకరాల్లో పుట్టగొడుగుల్లా ఫామ్ లేఅవుట్లు రిజిస్టర్ అవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమేమో జాతీయ స్థాయికి ఎదగాలన్న కసితో రాష్ట్ర వ్యవహారాల్ని పూర్తిగా గాలికొదిలేసింది. ఇప్పుడైనా ఈ ప్రీలాంచ్ స్కామర్లను నియంత్రించాలి. లేకపోతే, రేపొద్దున ప్రీలాంచ్ స్కాములే ప్రభుత్వం మెడకు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదు.
This website uses cookies.