దేశంలో కరోనా పరిస్థితుల అనంతరం పారిశ్రామిక, గిడ్డంగుల వినియోగం స్థిరంగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశంలోని 5 ప్రధాన నగరాల్లో వీటి వినియోగం 7 శాతం పెరుగుదలతో 10.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణానికి చేరింది. 28 శాతం వాటాతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. 24 శాతం షేర్ తో పుణె రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో వీటి సరఫరాలో మాత్రం తగ్గుదల నమోదైంది. 2022 ప్రథమార్థంలో ఏకంగా 24 శాతం మేర తగ్గి 11.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
ఇన్ పుట్ వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అవసరాన్ని బట్టి, ముందస్తు ఒప్పందాల మేరకే ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఫలితంగా వీటి అద్దెలు స్వల్పంగా పెరిగాయి. ఇక గిడ్డంగుల వినియోగంలో 55 శాతం వాటాతో థర్త్ పార్టీ లాజిస్టిక్ కంపెనీలే అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాత ఇంజనీరింగ్, ఆటోమొబైల్ రంగాలు 12 శాతం చొప్పున షేర్ కలిగి ఉన్నాయి.