Categories: TOP STORIES

‘వాస‌వి’ య‌ర్రం విజ‌య్ కుమార్‌కి ఇండియ‌న్ అచీవ‌ర్ అవార్డు

  • శుభాకాంక్ష‌లు తెలిపిన
    డెవ‌ల‌ప‌ర్లు, బంధుమిత్రులు

రెజ్ న్యూస్‌, హైద‌రాబాద్‌: వాస‌వి గ్రూప్ సీఎండీ య‌ర్రం విజయ్ కుమార్‌కి ఇండియ‌న్ అచీవ‌ర్ అవార్డు వ‌రించింది. బుధ‌వారం న్యూ ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. భార‌త నిర్మాణ మ‌రియు రియ‌ల్ రంగంలో విశిష్ఠ‌మైన సేవ‌ల్ని అందిస్తూ.. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద అందుబాటు గృహాల ప్రాజెక్టును చేప‌ట్టినందుకు గాను ఆయ‌న‌కీ అవార్డు ల‌భించింది. భార‌త విధ్వంస‌క‌ర బ్యాట్స‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌, న‌టి క‌రిష్మా క‌పూర్‌, సింగ‌ర్ మికా సింగ్ త‌దిత‌రులు ఈ అవార్డును అందుకున్న జాబితాలో ఉన్నారు. అవార్డును అందుకున్న సంద‌ర్భంగా విజ‌య్ కుమార్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆయ‌న బంధుమిత్రులు, దక్షిణాది రాష్ట్రాల‌కు చెందిన బిల్డ‌ర్లు అభినంద‌న‌లు తెలిపారు.

వాస‌వి గ్రూప్ సీఎండీ విజ‌య్ కుమార్‌.. బాచుప‌ల్లిలో వాస‌వి అర్బ‌న్ అనే అఫ‌ర్డ‌బుల్ ల‌గ్జ‌రీ ప్రాజెక్టును చేప‌ట్టారు. ఆయ‌న సామాన్యుల‌కు సక‌ల సౌక‌ర్యాల్ని అందించాల‌న్న ల‌క్ష్యంతో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 17.34 ఎక‌రాల్లో 12 ట‌వ‌ర్ల‌ను ఇందులో సంస్థ నిర్మిస్తోంది. ఒక్కో ట‌వ‌ర్ ఎత్తు 23 అంత‌స్తుల దాకా ఉంటుంది. ఇందులో వ‌చ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య‌.. 3,714. డెబ్బ‌య్ శాతం స్థ‌లాన్ని ఓపెన్ స్పేసెస్‌గా ఉంచ‌గా.. కేవ‌లం ముప్ప‌య్ శాతం స్థ‌లంలోనే నిర్మాణం వ‌స్తుంది. ఇంత బ‌డా ప్రాజెక్టుతో పాటు న‌గ‌రంలో ప‌లు అనేక నిర్మాణాల్ని చేప‌డుతూ.. వంద‌లాది మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల్ని క‌ల్పిస్తున్నందుకు ఆయ‌న‌కీ అవార్డు ల‌భించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా సంస్థ సీఎండీ య‌ర్రం విజ‌య్ కుమార్ రెజ్ న్యూస్‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకానికి సొంతింటి క‌ల‌ను సాకారం చేయాల‌న్న ఉన్న‌త ల‌క్ష్యంతోనే వాస‌వి అర్బ‌న్‌కు శ్రీకారం చుట్టామ‌న్నారు. నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. మూడు రోజుల క్రిత‌మే ఎల్‌బీన‌గ‌ర్‌లో వాస‌వి ఆనంద నిల‌యం ప్రాజెక్టును ఘ‌నంగా ఆరంభించామ‌న్నారు.

This website uses cookies.