- 2024లో 39.5 మిలియన్ చ.అ. మేర లావాదేవీలు
- సీబీఆర్ఈ నివేదిక వెల్లడి
దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ లీజింగ్ అదరగొట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 39.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలు మొత్త లీజింగ్ పరిమాణంలో 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ మేరకు వివరాలను సీబీఆర్ఈ తాజా నివేదిక వెల్లడించింది. 2024లో వీటి సరఫరా సైతం బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 38.6 మిలియన్ చదరపు అడుగుల సరఫరా జరిగింది. సరఫరాలో ముంబై, చెన్నై, బెంగళూరు కీలక పాత్ర పోషించాయి. స్పేస్ టేకప్ లో ప్రధానంగా థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కీలకంగా వ్యవహరించాయి. మొత్తం లీజింగ్ లో వీటి వాటా 41 శాతంగా ఉంది.
* ఇంజనీరింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు 18 శాతం వాటాతో ఉన్నాయి. 50వేల చదరపు అడుగులలోపు లావాదేవీలే ఎక్కువగా జరిగాయి. మొత్తం లీజింగ్ లో ఇది 43 శాతంగా ఉంది. 50వేల నుంచి లక్ష చదరపు అడుగుల లోపు లావాదేవీలు, లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ స్పేస్ ఉన్న లావాదేవీలు 28 శాతం చొప్పున నమోదయ్యాయి. కాగా, 2024 ద్వితీయార్థంలో లీజింగ్ 23 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన ఇది 17 శాతం ఎక్కువ. ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీల నుంచి డిమాండ్ పునరుజ్జీవనం, కస్టమర్ సేవలను మెరుగుపరచడం, క్విక్-కామర్స్ ఆపరేటర్ల విస్తరణ, త్రీపీఎల్, ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ప్లేయర్‌ల దూకుడు వల్ల ఈ వృద్ధి జరిగింది.
* నగరాల వారీగా చూస్తే.. 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు బెంగళూరులో 3.6 మిలియన్ చదరపు అడుగుల ఐ అండ్ ఎల్ లీజింగ్ జరగ్గా.. హైదరాబాద్ లో 2.4 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. ఢిల్లీలో 6.5 మిలియన్ చదరపు అడుగులు, ముంబైలో 2.8 మిలియన్ చదరపు అడుగులు, చెన్నైలో 1.5 మిలియన్ చదరపు అడుగులు, పుణెలో ఒక మిలియన్ చదరపు అడుగులు, అహ్మదాబాద్ లో 1.4 మిలియన్ చదరపు అడుగులు, కోల్ కతాలో 3.6 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. “ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగంలో అద్భుతమైన వృద్ధి దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. 2024లో కీలక నగరాల్లో లీజింగ్ కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. 41 శాతం వాటాతో ఉన్న త్రీపీఎల్ ప్రొవైడర్ల ఆధిపత్యం, ఈ రంగం భవిష్యత్తును రూపొందించడంలో వారి కీలక పాత్రను నొక్కి చెబుతుంది. ఇన్-సిటీ వేర్‌హౌసింగ్, క్విక్-కామర్స్ 2025లో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని సీబీఆర్ఈ ఇండియా సీఈఓ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు.