Categories: LATEST UPDATES

హౌసింగ్‌లో సంస్థాగత పెట్టుబడులు అదుర్స్

హౌసింగ్ విభాగంలో సంస్థాగత పెట్టుబడులు జోరుగా దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. జనవరి-జూన్‌ మధ్య రూ.3,552 కోట్లు వచ్చినట్టు కొలియర్స్‌ ఇండియా వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో ఈ పెట్టుబడులు రూ.738 కోట్లు మాత్రమే ఉండడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండస్ట్రియల్‌, వేర్‌ హౌసింగ్‌ లోకి 95 శాతం అధికంగా రూ.2870 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో ఈ పెట్టుబడులు రూ.1468 కోట్లుగా ఉన్నాయి.

మొత్తానికి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రెసిడెన్షియల్ విభాగంలో ఐదు రెట్ల మేర సంస్థాగత పెట్టుబడులు పెరగడం గమనార్హం. ప్రధానంగా దేశీయ పెట్టుబడులు ఈ వృద్ధికి మద్దతుగా ఉన్నాయి. పారిశ్రామిక ఆస్తుల విభాగం కూడా రెండున్నర రెట్లు అధికంగా పెట్టుబడులను ఆకర్షించింది. డేటా సెంటర్లు, లైఫ్‌ సైన్సెస్‌, సీనియర్‌ హౌసింగ్‌ హాలీడ్‌ హోమ్స్‌, స్టూడెంట్‌ హౌసింగ్‌ తదితర ప్రత్యామ్నాయ ఆస్తుల విభాగంలో పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 60 శాతం క్షీణించి రూ.1296 కోట్లకు పరిమితమైనట్టు నివేదిక పేర్కొంది.

గతేడాది ఇదే కాలంలో రూ.3273 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే భారత రియల్‌ ఎస్టేట్‌ విభాగంలోకి సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 43 శాతం పెరిగి 3.7 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 2.57 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2018లో 5.7 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2019లో 6.3 బిలియన్‌ డాలర్లు, 2020లో 4.8 బిలియన్‌ డాలర్లు, 2021లో 4 బిలియన్‌ డాలర్లు, 2022లో 4.9 బిలియన్‌ డాలర్ల చొప్పున వచ్చాయి.

This website uses cookies.