Categories: TOP STORIES

మ‌హాన‌గ‌రానికి మ‌ణిహారం.. కోకాపేట్ నియోపోలీస్

  • అద్భుతమైన అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం
  • రెండవ దశలో 45.33 ఎకరాల ఏడు ల్యాండ్ పార్సిల్స్ వేలం
  • మల్టిపుల్ యూస్ జోన్, సింగిల్ విండో క్లియరెన్స్ లు
  • ప్రీ బిడ్ మీటింగులో ఎంఏయుడి స్పెషల్ సీఎస్‌ అర్విoద్ కుమార్

కోకాపేట్ హెచ్ఎండిఏ లేఅవుట్ రాజధాని హైదరాబాద్ కు మణిహారంగా మారునున్న‌ద‌ని.. అద్భుతమైన అంతర్జాతీయ స్థాయి భవన నిర్మాణాలకు నిలయంగా మారుతుందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ తెలిపారు. ఇటీవ‌ల టీహబ్ లో ఏర్పాటు చేసిన కోకాపేట్ నియోపోలీస్ లేఅవుట్ ప్రీబిడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోకాపేట్ నియోపోలీస్ లేఅవుట్ లో సుమారు రూ.450 కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, మరో ఏడాదిన్నర కాలంలో ఈ ప్రాంతం అనూహ్యమైన రీతిలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని వివరించారు. రెండో దశలో ఏడు ల్యాండ్ పార్సిల్స్ ను ఆన్ లైన్ వేలం ప్రక్రియ ద్వారా విక్రయిస్తున్నామని, మొత్తంగా 45.33 ఎకరాల విస్తీర్ణం గల ఏడు ల్యాండ్ పార్సెల్స్ లలో 3.60 ఎకరాల నుంచి 9.71 ఎకరాల విస్తీర్ణం కలిగిన ల్యాండ్ పార్సిల్స్ ఉన్నట్లు తెలిపారు.

 

హైదరాబాద్ నగరం విస్తీర్ణం అంచలంచలుగా పెరుగుతుందని, ప్రణాళికాబద్ధంగా నగర విస్తీర్ణాన్ని కొలమానంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో విశేషంగా కృషి చేస్తుందని, గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి మీకళ్ళ ఎదుట కనబడుతుందని అర్విoద్ కుమార్ అన్నారు. వెస్ట్రన్ కారిడార్ లో నియోపోలీస్ లేఅవుట్ కు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, మల్టిపుల్ యూస్ జోన్ పరిధిలో ఉన్న ఈ లేఔట్ లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు టీఎస్ బిపాస్ ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ అనుమతులు పొందవచ్చునని చెప్పారు. సముద్ర నీటిమట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నియోపోలీస్ లేఅవుట్ లో కేవలం ఎమినిటీస్ కోసం హెచ్ఎండిఏ 41 ఎకరాలను కేటాయించిందని వివరించారు.
ప్రజల విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని, వాస్తు ప్రమాణాలకు లోబడి నియోపోలీస్ లేఅవుట్ లోని ప్రతి ల్యాండ్ పార్సిల్ (ప్లాట్)కు నార్త్ ఫేస్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఒక డెవలపర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రీ బిడ్ సమావేశానికి 50కి పైగా బడా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రీ బిడ్ సమావేశానికి హాజరు కాలేని జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల కోసం హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జూన్ మీటింగ్ ను నిర్వహించి నియోపోలీస్ లేఅవుట్ ప్రాధాన్యతను వెల్లడించారు. ఈ ప్రీ బిడ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వరంగసంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, సెక్రెటరీ పి.చంద్రయ్య, డైరెక్టర్(ప్లానింగ్) విద్యాధర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సిఐఓ) ఎస్.కే మీరా, చీఫ్ అకౌంట్ ఆఫీసర్(సిఎఓ) విజయలక్ష్మి, ఓఎస్డి ఎం.రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

This website uses cookies.