‘‘2007లో నొయిడా మరియు గుర్గావ్ లో.. ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్మినవారిలో నూట యాభై మంది ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చారు.. మరో నూట యాభై మంది శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించినా.. కొనుగోలుదారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. అదే కథ మళ్లీ హైదరాబాద్‌లో పునరావృతం అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, మన వద్ద 300 మంది కాకపోయినా.. అందులో ఇరవై శాతం మంది బిల్డర్లు జైలుకు వెళ్లే అవకాశముంది. 2023 నుంచి ఎక్కువ మంది జైలుకెళ్లే అవకాశముంద’’ని ట్రెడా అడ్వజైర్, లహరీ గ్రూప్ ఎండీ జి.హరిబాబు విశ్లేషించారు. ఇప్పటికైనా హైదరాబాద్ డెవలపర్లు వాస్తవిక పరిస్థితుల్ని అంచనా వేసి.. అందుకు తగ్గట్టుగా నిర్మాణాల్ని చేపట్టాలని సూచించారు. 2022లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పోకడల గురించి ఆయన రియల్ ఎస్టేట్ గురుకి ప్రత్యేకంగా వివరించారు. సారాంశం జి.హరిబాబు మాటల్లోనే..
‘‘ హైదరాబాద్ రియల్ మార్కెట్ ప్రస్తుతం దిద్దుబాటు స్థాయికి చేరుకుంది. ఎందుకంటే, భూమి ధరలు అనూహ్యంగా పెరిగాయి. నిన్నటివరకూ 200 గజాల ప్లాటు రూ. 20 లక్షలకు దొరికేది. ఇప్పుడేమో అరవై లక్షలై కూర్చుంది. దీంతో, చాలామంది కొనుగోలుదారులు కొనలేని పరిస్థితి. అందుకే, ప్లాట్లను కొనేవారు క్రమక్రమంగా తగ్గిపోతారు. ఫలితంగా, వచ్చే ఆరు నెలల పాటు లావాదేవీలు తక్కువగా నమోదు అవుతాయి. అదే సమయంలో, అర్జంటుగా సొమ్ము కావాలనుకునేవారు పది నుంచి ఇరవై శాతం తక్కువకే భూముల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తారు. ఎప్పుడైనా మన మార్కెట్లో ప్లాట్ల ధరలు ఇలాగే తగ్గి స్థిరపడతాయి.
ప్లాట్ల మీద పెట్టుబడి పెట్టినవారెవ్వరైనా.. గృహరుణ సాయంతో ప్లాట్లు కొంటే గనక.. అలాంటి వారూ తక్కువ రేటుకు అమ్మేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడంటే కరోనా వల్ల గిరాకీ తగ్గిందని అనుకున్నప్పటికీ.. ఫిబ్రవరి, మార్చి నుంచి దిద్దుబాటు ఆరంభమవుతుంది. ఒకవేళ, అప్పటికీ కరోనా ఉదృతమై, రేట్లు మరింత తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్కసారి వెనక్కి వెళితే.. 2005 నుంచి 2008 వరకూ రియల్ బూమ్ చూశాం. అప్పట్లో నార్సింగిలో ఎకరం ధర రూ.12 కోట్ల దాకా పలికింది. ఆ తర్వాత ఆర్థిక మాంద్యం కారణంగా కానీ ఇతరత్రా అంశాల వల్ల రూ.6 కోట్లకు పడిపోయింది. రూ.65 లక్షలు పలికిన వ్యవసాయ భూముల ధర.. ఆతర్వాత ఒక్కసారిగా రూ.30 లక్షలకు తగ్గిపోయింది. నిజానికి, అలాంటి కరెక్షన్.. యాభై ఏళ్లలో వంద ఏళ్లకో జరుగుతుంది. ఇప్పుడు ఆ స్థాయిలో తగ్గుతుందని చెప్పలేను కానీ, కనీసం పాతిక శాతం ధరలైతే రానున్న రోజుల్లో తగ్గుతాయని అంచనా వేస్తున్నాను.
హైదరాబాద్‌లో ఐటీ, వాణిజ్య సముదాయాలు నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే వీటికి ఆదరణ గణనీయంగా తగ్గింది. ఇంత భారీ విస్తీర్ణంలో కొత్త కంపెనీలు వచ్చేందుకు ఎంతలేదన్నా ఆరు లేదా ఏడేళ్లు పడుతుంది. నివాస సముదాయాల విషయానికొస్తే.. నగరంలో ప్రస్తుతం ముప్పయ్ కోట్ల చదరపు అడుగుల స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మన వద్ద యూడీఎస్, ప్రీలాంచుల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. ఫ్లాటు కొనడానికి వచ్చే కొనుగోలుదారులు ప్రీలాంచ్ రేటేంత అని అడుతున్నారు. నార్సింగిలో పూర్తయ్యేందుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులో ధర చదరపు అడుక్కీ రూ.9000కి విక్రయిస్తుంటే.. కొంతమంది బయ్యర్లు అందులో కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఎందుకంటే, ప్రీలాంచ్ ప్రాజెక్టులో చదరపు అడుక్కీ రూ.4000- 4500కే కొంటున్నారు. అవసరం అనుకుంటే, మూడేళ్లు అద్దెకు ఉండేందుకైనా సిద్ధపడుతున్నారు.
రియల్ మార్కెట్ ప్రత్యేకత ఏమిటంటే.. లావాదేవీలు తగ్గుముఖం పడినప్పుడు కానీ భూముల ధరలు కిందికొచ్చినప్పుడు.. చాలామంది కొనేందుకు వెనకడుగు వేస్తారు. రేటు మరింత పడిపోతుందేమోననే ఆశతో కొంతకాలం ఎదురు చూస్తారు. ఇలా, 2023 వరకూ ప్లాట్లు, భూముల లావాదేవీలు తగ్గుముఖం పడతాయి.
This website uses cookies.