Categories: LATEST UPDATES

బిచాణా ఎత్తేసే బిల్డరే.. డౌటే లేదు!

  • ఇందులో ఎలాంటి సందేహం లేదు
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
  • ఇలాంటి వాటిలో కొనవద్దు

ఈ బిల్డర్ ఎవరో నిజంగానే హైదరాబాద్లో పెను సంచలనం సృష్తిస్తాడనుకుంటా. 26 లక్షలకే డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కట్టిస్తాడట. అది కూడా ప్రీలాంచ్ ఆఫర్లో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జి ప్లస్ 14 అంతస్తుల్లో కడతాడట. అసలీ ప్రీలాంచ్ ఆఫర్ చేసిన వ్యక్తికి 15 అంతస్తుల అపార్టుమెంట్ కట్టడానికి ఖర్చెంత అవుతుందో తెలుసా? గ‌తంలో అపార్టుమెంట్లు ఏమైనా క‌ట్టాడా? అయితే, వాటిని స‌కాలంలో అందించాడా? స్థానిక సంస్థ‌లు మ‌రియు రెరా అనుమ‌తి తీసుకుని అపార్టుమెంట్ల‌ను నాణ్య‌త‌గా నిర్మించాడా? ఈ విష‌యం గురించి తెలిస్తే బిల్డ‌ర్ యొక్క అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డుతుంది. కాబ‌ట్టి, ఇలాంటి ఆఫ‌ర్లు చేస్తే బిల్డ‌ర్ల‌ను త‌ప్ప‌కుండా కొనుగోలుదారులు అడ‌గాల్సిన ప్ర‌శ్న‌లివి.

ప్రస్తుత భూముల ధరలు, పెరిగిన స్టీలు, సిమెంటు, ఇసుక, రంగులు, హార్డ్ వేర్, సానిటరీ వేర్, లేబర్ ఖర్చు వంటివన్నీ లెక్కిస్తే.. చదరపు అడుక్కీ ఎంత అవుతుందో తెలుసా? ఇవన్నీ తెలియకుండానే ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్లు పెడితే ఎలా? ఇది తప్పకుండా జనాల్నుంచి డబ్బులు తీసుకుని బిచాణా ఎత్తేసే కంపెనీలాగే ఉంది. కాబట్టి, ప్రీలాంచ్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు దూరంగా ఉండండి. అత్యాశకు పోయి ఇలాంటి ప్రాజెక్టుల్లో కొంటే మీరే అడ్డంగా మునిగిపోతారు. ఆతర్వాత మీరు ఎన్ని ధర్నాలు చేసినా.. దీక్షలు చేసినా ఉపయోగం ఉండదు. పోలీసులేమో కేసు నమోదు చేసుకుంటారు. కానీ, తెలంగాణ రెరా అథారిటీ మీకేమాత్రం సాయం చేయదు. ఎందుకంటే, రెరా అనుమతి గల ప్రాజెక్టులో కొనలేదు కాబట్టి, మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందలేరు. అందుకే, మీరు ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై.. మీ సొమ్మును బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవద్దు.
ఒకవేళ ఈ బిల్డర్ నిజంగానే 15 అంతస్తుల అపార్టుమెంట్లో చదరపు అడుక్కీ రూ.2600కే ఫ్లాట్ ఇస్తానంటే.. ఎలా కడతారో ముందే చెప్పమని చెప్పాలి. ఆ రహస్యమేమిటో చెబితే.. నగరంలోని బిల్డర్లందరూ అదే సూత్రాన్ని పాటిస్తారు. దీన్నే ఉత్తమ ప్రమాణాలుగా తీసుకుంటారు. కాబ‌ట్టి, ఇలాంటి దొంగ ఆఫ‌ర్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి.

This website uses cookies.