రియల్ ఎస్టేట్ గురుతో ప్రగతి గ్రూప్ ఛైర్మన్ డా. జీబీకే రావు
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ లోపు ఎక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినా.. భవిష్యత్తులో మంచి అప్రిసీయేషన్‌ని అందుకోవచ్చని ప్రగతి గ్రూప్ ఛైర్మన్ డా. జీబీకే రావు అభిప్రాయపడ్డారు. విజయదశమి సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. సౌత్ వెస్ట్ హైదరాబాద్ రానున్న రోజుల్లో గణనీయంగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా వికారాబాద్ వరకూ వచ్చే పదేళ్లలో ప్లాట్ల రేట్లకు ఊహించిన దానికంటే ఎక్కువ పెరుగుదల ఉంటుందన్నారు. పండగ సీజన్ అని కాకుండా.. చేతిలో ఎప్పుడు సొమ్ముంటే అప్పుడు ప్లాట్లను కొనాలని సూచించారు. కాకపోతే, వచ్చే పదేళ్లను దృష్టిలో పెట్టుకుని మదుపు చేయాలన్నారు. ఇంకా, ఏమన్నారో డా.జీబీకే రావు మాటల్లోనే..
హైదరాబాద్ మొత్తం కాంక్రీటు జంగిల్లా మారిపోయింది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కష్టపడి మనమెంత డబ్బు సంపాదించినా మళ్లీ ఆస్పత్రులకే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకే, ప్రతిఒక్కరూ నగరంలో నుంచి బయటికొచ్చి నివసించడానికి మానసికంగా సంసిద్ధులు కావాలి. ప్రశాంతమైన వాతావరణంలో.. పచ్చటి చెట్ల మధ్య ఒక చక్కటి ఇల్లు కట్టుకుని నివసిస్తే ఆటోమెటిగ్గా ఆరోగ్యం మెరుగు అవుతుంది. కాబట్టి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాంక్రీటు జంగిల్లో నివసించాల్సిన అవసరం లేదు. అనేక రకాల కొత్త రకాల జబ్బులు వస్తుంటే.. ఎంత సొమ్ము సంపాదించినా ఏం లాభం? ప్రకృతితో మమేకం అయ్యేలా వేసిన లేఅవుట్లలో ఇల్లు కొంటేనే ఉత్తమం. ఏదో వెంచర్ వేశామా.. ప్లాట్లు అమ్మేశామా.. అని కాకుండా.. పచ్చదనానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి చేసే లేఅవుట్లకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ఎక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినా, సొంతంగా ఇంటిని నిర్మించుకునే క్రమంలో మొక్కలకు స్థానం కల్పించాలి. ఇండోర్, ఔట్‌డోర్ మొక్కలను ప్రతిఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి.
హైదరాబాద్‌లో ప్లాట్ల ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయనే విషయం మర్చిపోవద్దు. రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు దాకా మీకు నచ్చిన ప్రాంతంలో ప్లాట్లను కొన్నా ధర పెరుగుతుంది. ప్రస్తుతం రేట్లు అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి, నచ్చినవారు కొనుక్కుంటే ఉత్తమం. ఇప్పుడు కొనకుండా.. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటయ్యాక కొంటామంటే.. ఇప్పుడున్న ధరకు ప్లాట్లు రావు. ఇప్పుడో వెయ్యి గజాలు కొనుక్కుని.. కొన్నాళ్ల తర్వాత అందులో 500 గజాలు అమ్మేసి.. ఆ సొమ్ముతో మిగతా స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు కదా. ప్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు ఎప్పుడైనా ఇదే విధంగా ఆలోచించాలి. మీరు ఎందులో మదుపు చేసినా.. ప్లాట్లలో పెట్టినదానికంటే అధిక రాబడి రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం గజం రూ. 10 వేలు పెట్టి ప్లాటు కొనుగోలు చేస్తే.. పదేళ్ల తర్వాత గజం లక్ష అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా, సౌత్ వెస్ట్ లో ఈతరహా పెరుగుదలను ఆశించొచ్చు. ప్రస్తుతం మా ప్రగతి గ్రీన్ మిడోస్‌లో గజం రూ.25 వేలు, అంతకంటే ముందున్న వెంచర్‌లో రూ.15 వేలు చెబుతున్నాం. ఇతర ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో అభివృద్ధి పనుల్ని మొదలు పెడతాం. నిబంధనల ప్రకారం రోడ్లు వేసి, ప్లాంటేషన్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం.