గత ఐదేళ్లలో హైదరాబాద్లో ప్లాట్ల రేట్లు రెండు రెట్లు పెరిగాయి. .శ్రీశైలం రోడ్డులోనే మూడేళ్ల క్రితం గజం రూ.3,500 ఉన్న ధర నేడు పదివేలకు చేరుకుంది. నందిగామలో 2018లో గజం పది వేలు ఉన్న రేటు ప్రస్తుతం రూ.20 వేలు అయ్యింది.. కోకాపేట్ వేలం తర్వాత పశ్చిమ హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో స్థలాల ధరలు ఇరవై నుంచి ముప్పయ్ శాతం పెరిగాయి. మొత్తానికి, ఎలా చూసినా.. ఎన్ని కరోనా వేవ్లు వచ్చినా.. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్లో ప్లాట్ల ధరలు కనీసం యాభై నుంచి అరవై శాతం పక్కాగా పెరుగుతాయని శుభగృహ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి విశ్లేషించారు. ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మెట్రో నగరాలతో పోల్చితే నేటికీ హైదరాబాద్ శివార్లలో ప్లాట్ల ధరలు అందుబాటు ధరలోనే ఉన్నాయని తెలిపారు. భాగ్యనగర రియల్ రంగం అభివృద్ధి చెందుతుందే తప్ప తగ్గుముఖం పట్టే అవకాశమే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, విజయవాడలోని బందరు రోడ్డులో అమ్మకాలు ఊపందుకున్నాయని వివరించారు. ఇంకా, ఏమన్నారో ఆయన మాటల్లోనే..
”సెకండ్ వేవ్ లో రియల్ సంస్థలు ఇబ్బంది పడ్డాయి. కానీ, లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ రియల్ మార్కెట్లో అమ్మకాలు క్రమక్రమంగా పెరిగాయి. కోకాపేట్ వేలం తర్వాత భూముల ధరలు ఇరవై నుంచి ముప్పయ్ శాతం ధరలు పెరిగాయి. దీన్ని ప్రభావం కొల్లూరు నుంచి సదాశివపేట్ వరకూ పడింది. కొల్లూరులో ఎకరం భూమి 8 నుంచి 10 కోట్లలో దొరికేది. ఇప్పుడు అక్కడ పదిహేను కోట్లు దాటేసింది. నందిగామ, పటాన్‌చెరులో రెండున్నర కోట్లు ఎకరం ఉండేది. ప్రస్తుతం నాలుగు కోట్లు చెబుతున్నారు. సంగారెడ్డిలో కోటి రూపాయలున్న ఎకరం కోటిన్నర అయ్యింది. మార్కెట్లో ఏదో అద్భుతం జరుగుతుందన్నట్లుగా కొనుగోలుదారులు పోటీపడి ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే అన్నీ చోట్ల ఇలాంటి వృద్ధి కనిపించడం లేదనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, శ్రీశైలం రోడ్డులో నాలుగువెంచర్లు అభివృద్ధి చేస్తున్నాం. కొనుగోలుదారుల్లో ఎప్పుడైనా యాభై శాతం దాకా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఉంటారు. పాతిక శాతం ప్రవాస భారతీయులు, మిగతా వారిలో వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పని చేసేవారుంటారు. మా వెంచర్లలో రేట్ల విషయానికొస్తే.. భానూరులో గజం ఇరవై వేలు చెబుతున్నాం. పటాన్‌చెరు, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో గజం 10 నుంచి 12 వేలు, శ్రీశైలం రోడ్డులోని లేమూరులో గజం రూ.10 వేలు అమ్ముతున్నాం. రెరా అథారిటీ సీరియస్ కావడంతో.. ప్రీ లాంచ్ ప్రాజెక్టులూ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఇప్పటివరకూ 95 లేఅవుట్లను రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి చేశాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయవాడలో మూడు లేఅవుట్లు, వైజాగ్‌లో నాలుగు లేఅవుట్లను అభివృద్ది చేస్తున్నాం. విజయవాడలోని మంగళగిరి, తాడేపల్లి, నంబూరు, కాకాని వంటి ప్రాంతాల్లో పది నుంచి పదివేల రూపాయలు పెడితే గజం స్థలం దొరకుతుంది. బందరు రోడ్డులో కొంత కదలికలున్నాయి. కంకిపాడు, వుయ్యూరు వంటి ప్రాంతాల్లో గజం రేటు 5 నుంచి 7 వేలు చెబుతున్నారు. గన్నవరం రోడ్డులో గజం 5 నుంచి 10 వేల దాకా పలుకుతోంది. విజయవాడ నుంచి బందరు దాకా జాతీయ రహదారి పూర్తి కావడంతో.. వాహనాల రాకపోకలు సులువుగా మారడమే ఇందుకు ప్రధాన కారణం.
ఆంధ్ర రాజధాని వైజాగ్ అవుతుందనే ఉద్దేశ్యంలో.. అక్కడి రియల్ రంగం కాస్త మెరుగ్గా ఉంది. గతంతో పోల్చితే అంత అద్భుతంగా లేకపోయినప్పటికీ, ఉన్నదాంట్లో వైజాగ్ బెటర్ అని చెప్పొచ్చు. భోగాపురం రోడ్డు, ఆనందపురం, మధురవాడ, భీమిలీ, తగరపువలస వంటి ఏరియాల్లో అమ్మకాలు పెరిగాయి. ఇక్కడ గజం ధర ఎనిమిది వేల రూపాయల నుంచి దొరుకుతుంది. ఆనందపురంలో 15 వేలు, భీమిలీ పది వేల్నుంచి, తగరపువలస 10 నుంచి12 వేలు, ఆనందపురం నుంచి పెందుర్తి కొత్త రోడ్డులో గజం రూ.15 వేల దాకా రేటు ఉంది. సింహాచలం తర్వాత ఒక విల్లా ప్రాజెక్టును చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
తరతరాలకు చెరగని చిరునామా లాంటి ప్రాజెక్టుల్ని ప్రజలకు అందించాలన్న ఒక చక్కటి ఉద్దేశ్యంతో 2004లో శుభగృహ సంస్థను ఆరంభించాం. అప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లో 95 వరకూ లేఅవుట్లను వేశాం. రెండు వేలకు పైగా ఎకరాల్ని అభివృద్ధి చేశాం. రెరా అనుమతి తీసుకుని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 4, విజయవాడలో 3, వైజాగ్‌లో 4 వెంచర్లను అభివృద్ధి చేస్తున్నాం.
This website uses cookies.